వీల్‌ చైర్‌ ట్యాక్సీ | Easy Move Wheelchair Taxi Helpful To Ill People | Sakshi
Sakshi News home page

వీల్‌ చైర్‌ ట్యాక్సీ

Published Sat, Aug 11 2018 11:41 PM | Last Updated on Mon, Aug 13 2018 11:09 AM

Easy Move Wheelchair Taxi Helpful To Ill People - Sakshi

అనారోగ్యం వల్లో లేదా రోడ్డు ప్రమాదం కారణంగానో కొంతమంది వీల్‌ చైర్‌కే పరిమితం అయిపోతుంటారు. అలాంటి వారిని ఆసుపత్రికో,  ఏదైనా శుభకార్యానికో లేదా మరో చోటుకో తీసుకెళ్లాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని.  మరోవైపు  మిగతా వాళ్లలాగా తాము అన్నిచోట్లకీ వెళ్లలేకపోతున్నామని, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిపోయామని, ఎక్కడికెళ్లాలన్నా మరొకరిపై ఆధారపడాల్సి వస్తుందని మానసికంగానూ వీరు కుంగిపోతుంటారు. అయితే ఈ సమస్యలకు  పరిష్కారం చూపుతోంది ‘ఈజీ మూవ్‌’.  వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను అవసరమైన చోటుకి సులభంగా తీసుకెళ్లేందుకు వీల్‌చైర్‌ ట్యాక్సీలను ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబైలో ఇప్పటికే ఈ ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడువేల మంది ఈ సేవలు ఉపయోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 
 
ఎలా మొదలైంది
ఢిల్లీలో 2015లో దివ్యాంగుల 15వ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. అయితే అక్కడ వారికి అవసరమైన  వీల్‌చైర్‌ లిఫ్ట్‌లు, ర్యాంపులు అందుబాటులో లేవు. నిర్వాహకులు మెట్లపై ప్లేవుడ్‌ను మాత్రమే పరిచారు. ఇది ఈ సంస్థ కో ఫౌండర్‌ రోమియో రవ్వను కదిలించింది. వీల్‌చైర్‌కే పరిమితమైన తన స్నేహితుడి చెల్లెలు ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా వీల్‌చైర్‌పై కాలేజీకి వెళ్లి రావడం చూశారు. చాలా మందికి ఇలాంటి అవకాశం ఉండదు. మిగతావాళ్లకు కూడా ఇలాంటి సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుందనే మరో ఇద్దరి ఆలోచనలు తోడయ్యాయి. ..దీంతో ‘ఈజీ మూవ్‌’ కు అంకురార్పణ జరిగింది. కదలలేని స్థితిలో ఉన్న వాళ్లు గౌరవంగా, హుందాగా అనుకున్న చోటుకి వెళ్లేలా సేవలందించడమే తమ లక్ష్యమని నిర్వహకులు పేర్కొంటున్నారు. 

ఎలాంటి సేవలందిస్తారు
వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను తరలించేందుకు కార్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ద్వారా వీల్‌చైర్‌తో సహా  కారులోకి వెళ్లిపోవచ్చు. భద్రతాపరంగాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కారులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం ద్వారా రోగిని కారులోకి భద్రంగా చేర్చడంతో పాటు అవసరమైన సేవలు అందిస్తారు. ఆసుపత్రి, ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లడం.. తీసుకురావడం, దేవాలయాలు, పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లకు తీసుకెళతారు. అంతేకాదు సర దాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లాలన్నా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ముంబాయిలో అందుబాటులో ఉన్న వీల్‌ చైర్‌ టాక్సీ సర్వీసును త్వరలో గోవాలోనూ ప్రారంభించనున్నారు. 2019 నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు విస్తరింపచేయాలని సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.

 

ఎంత చార్జీ చేస్తారు
ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు బేసిక్‌ చార్జి రూ. 250 గా ఉంది. ప్రతీ నాలుగు కి.మీ కు అదనంగా రూ. 30 వసూలు చేస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రూ. 350 బేసిక్‌ చార్జి, ప్రతీ నాలుగు కి.మి. కు అదనంగా రూ. 40  చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఎనిమిది గంటల అద్దెకు కూడా లభిస్తాయి. అంతేకాదు సొంతకారు ఉన్న వారు తమ కారులో కూడా మార్పులు చేసుకోవాలంటే ఆ సదుపాయమూ ఇక్కడ అందుబాటులో ఉంది. వృద్ధులు, ప్రత్యేక అవసరాలు కల్గిన వారు సులభంగా ప్రయాణించే విధంగా కారులో మార్పులు చేస్తారు.

-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement