పార్టీల హోదాపై సమీక్ష పదేళ్లకోసారే: ఈసీ
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు జాతీయ, రాష్ట్ర పార్టీ హోదాపై సమీక్ష ఇకపై పదేళ్లకోసారి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం నిబంధనలు సవరించింది. ఇప్పటివరకు ఈ సమీక్ష ప్రతి ఐదేళ్లకోసారి ఉండేది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణీత ఓట్లు రాబట్టుకోనందున బీఎస్పీ, సీపీఐ, ఎన్‌సీపీ జాతీయ పార్టీ హోదా కోల్పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈ విషయమై 2014లో ఆయా పార్టీలకు ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది.
జాతీయ, రాష్ట్రీ య పార్టీగా గుర్తింపు పొందాలంటే అవసరమైన అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదని, అయితే ఆ హోదాపై సమీక్ష మాత్రం ప్రతి రెండు లోక్‌సభ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఉంటుందని ఎన్నికల కమిషన్ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంటే సమీక్ష ప్రతి పదేళ్లకోసారి ఉంటుంది. ప్రస్తుతం బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు.