'మహిళలను తిడితే జాగ్రత్త..'
న్యూఢిల్లీ: మహిళలను తిడితే ఈసారి సహించేది లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. అలా చేసిన వ్యక్తులకు పార్టీలకు నోటీసులు ఇచ్చి తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీహార్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు, నాయకులు పాటించాల్సిన కనీస ప్రమాణాలను ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. ఎన్నికల ప్రచారం పేరుతో ప్రత్యర్థి అభ్యర్థులపైన.. ముఖ్యంగా మహిళలపైన వారి గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడితే సహించేది లేదని గత ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హెచ్చరికలు చేస్తున్నామని చెప్పింది.
ఎన్నికల నిబంధనవళిని ప్రతి ఒక్కపార్టీ పాటించి విలువలతో నడుచుకొని ఎన్నికల కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాల్సిందిగా కోరింది. ప్రతి అడుగు ప్రతిక్షణం కమిషన్ పకడ్బంధీగా కనిపెడుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు మసులుకోవాలని హెచ్చరించింది. గత మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పలువురు పోటీ అభ్యర్థులు మహిళలపై ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసినట్లు తమవద్ద ఫిర్యాదులు ఉన్నాయని ఎలాంటి తీవ్ర చర్యతీసుకునేందుకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది.