న్యూఢిల్లీ : వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది.
నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.
దేశం ఏర్పాటు చేయడమనేది అంత సులువు కాదు: కేంద్రం
ప్రభుత్వం నిత్యానంద పాస్‌పోర్ట్ రద్దు చేసిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మాట్లాడుతూ.. గత నెల నుంచి కనబడకుండా పోయిన నిత్యానంద ఆచూకీని కనుగొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కొత్త పాస్‌పోర్ట్‌కై అతను పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు. నిత్యానంద కైలాస దేశంపై స్పందిస్తూ.. ఒక దేశం ఏర్పాటు చేయడం వెబ్‌సైట్ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment