ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే...
భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు విద్య ఎంతో సహకరిస్తుందని నోబుల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యతో సామాజిక న్యాయం కూడా చేకూరుతుందని, స్థిరమైన ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, సామాజిక న్యాయం ఒక్క విద్యవల్లే సాధ్యమౌతుందని సత్యార్థి తెలిపారు.
వచ్చే పదేళ్ళలో భారత్ లోని ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూస్తే... మన జీడీపీ వృద్ధి రేటు నాలుగు శాతం పెరుగుతుందని సత్యార్థి సూచించారు. రోటరీ ఇంటర్నేషనల్ లిటరసీ అండ్ ఏఎంపి ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పిల్లలను తరగతి గదుల్లోకి పంపగల్గితే అదే వారి అభివృద్ధికి మార్గదర్శకమౌతుందని, అనేక అవకాశాలను తెచ్చిపెడుతుందని అన్నారు. భారత ఆర్థిక అభివృద్ధికి అదే మార్గదర్శకమౌతుందని సత్యార్థి అన్నారు. ఉదాసీనత, భయం, అసహనం ప్రపంచానికి శత్రువులుగా మారాయని సత్యార్థి పునరుద్ఘాటించారు.