న్యూఢిల్లీ: ఎన్నికకు 48 గంటల ముందే పత్రికల్లో రాజకీయ ప్రకటనల నిషేధంపై అభిప్రాయం తెలపాలంటూ పార్టీలను ఎన్నికల సంఘం కోరనుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాపై అనుసరిస్తున్న విధానాన్నే ప్రింట్ మీడియాకు వర్తింపజేసే అంశంపై సూచనలివ్వనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చర్చించేందుకు సోమవారం ఎన్నికల సంఘం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది.
‘ప్రింట్ మీడియాను ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 126 (1)(బీ) పరిధిలోకి తీసుకురావడం, పోలింగ్ ముగిసేందుకు 48 గంటల ముందు అభ్యర్థి విజయావకాశాలపై సోషల్ మీడియాలో సర్వే నిర్వహించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నాం’ అని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. 2016లోనే ఎన్నికల సంఘం ‘పోలింగ్‌కు 48 గంటల ముందు పత్రికల్లో ప్రకటనలపై నిషేధం విధించే’లా ఎన్నికల చట్టంలో మార్పులు తీసుకురావలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏడు జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించింది. ఎన్నికల ఖర్చు నియంత్రణ, శాసన మండలి ఎన్నికల ఖర్చు సీలింగ్ పెంపు, పార్టీ ఖర్చులపై పరిమితి తదితర అంశాలను చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment