సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో సమావేశం అవుతోందని, ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను కూడా ఆహ్వానించారని తెలిపారు. సెక్షన్ 6ఏ, 6ఎఫ్ ఎన్నికల గుర్తులు రిజర్వేషన్, అలాట్మెంట్ 1968 ప్రకారం నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా ఉందని, విభజన అనంతరం టీఆర్‌ఎస్ కేవలం తెలంగాణలోనే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థులను పోటీకి నిలపలేని నేపథ్యంలో కారు గుర్తును తమ పార్టీ గుర్తుగా ఉండాలా వద్ద అనే అంశంపై స్పందించాలని నోటీసులు ఇచ్చారని అన్నారు. దీనికి బదులుగా పార్టీ అధ్యక్షుడితో చర్చించిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పినట్లు వినోద్ కుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment