సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను బెదిరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న మేనక ఈ నెల 16న సర్కోటా గ్రామంలో మాట్లాడుతూ.. బీజేపీకి మద్దతుగా ఉండే గ్రామాలను ఏబీసీడీ కేటగిరిలుగా విభజించి.. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని బెదిరింపులకు దిగారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించిన ఈసీ ఆమెను రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈసీ మేనకాకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఓటర్లను బెదిరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి రిపీట్ కావొద్దని హెచ్చరించింది. అంతకుముందు కూడా ఆమె నోరు జారారు.
(చదవండి : మళ్లీ నోరు జారిన మేనకా!)
తురబ్ ఖానీ గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా గెలుపు తథ్యం. కానీ ముస్లింల మద్దతు లేకుండా గెలవడం నాకు సంతోషాన్నివ్వదు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడానికి తామేమీ మహాత్మా గాంధీ వారసులం కాదు కదా’ అంటూ మేనక వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఆమె షోకాజ్ నోటీసులు అదుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మూడు రోజుల చొప్పున, బీఎస్పీ అధినేత్రి మాయావతి రెండు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్న కారణంగా ఈసీ వీరిపై చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment