
ఎలక్షన్ వాచ్
రజనీతో అళగిరి భేటీ
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు, బహిష్కృత నేత అళగిరి సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకోవడం తమిళనాట చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏ పార్టీతోనూ ప్రత్యక్ష సంబంధాలులేని అళగిరి తన కుమారుడు దురై దయానిధితో కలసి శుక్రవారం ఉదయం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు గడిపారు. తన కుమారుడు నిర్మించే తర్వాతి చిత్రంలో హీరోగా నటించాలని రజనీకాంత్‌ను అడిగేందుకు, తమ మధ్య రాజకీయాలపై చర్చ జరగలేదన్నారు. డీఎంకే ఒక మట్టి గుర్రమని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకటి లేదా రెండు స్థానాలు వస్తే గొప్పని వ్యాఖ్యానించారు. రజనీతో భేటీకి సంబంధించిన ఫొటోను అళగిరి కుమారుడు దురై దయానిధి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ..: మరోవైపు అళగిరి శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్యా సుమారు 45 నిమిషాల సేపు చర్చలు జరిగాయి. తాజా రాజాకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చేందుకు అళగిరి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే అళగిరికి రాజ్‌నాథ్ ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది.
బీజేపీ తీర్థం పుచ్చుకున్న శ్రీరాములు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి బి.శ్రీరాములు శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చా రు. శ్రీరాములు మాట్లాడుతూ.. మోడీ ప్రధాని కావాల్సిన అవసరముందని, దీనికి తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరానని వెల్లడించారు. సుష్మా స్వరా జ్ తన చేరికను వ్యతిరేకించారనే వార్తలపై వివరణ ఇస్తూ, ఆమె సహా అందరి అంగీకారంతోనే బీజేపీలో చేరానన్నారు. సాంకేతిక కారణాల వల్ల బీఎస్‌ఆర్ కాంగ్రెస్ బీజేపీలో విలీనం కాలేదని మాజీ ఉపముఖ్యమంత్రి ఈశ్వరప్ప చెప్పారు. తాను తీవ్రంగా వ్యతిరేకించినా శ్రీరాములును పార్టీలో చేర్చుకున్నారని సుష్మ పేర్కొన్నారు.
జైరాం రమేశ్ కోడ్ ఉల్లంఘించారు: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ పలు పథకాలు ప్రకటించి, ప్యాకేజీలకు హామీలివ్వడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. సీమాంధ్రకు రూ.50వేల కోట్ల ప్యాకేజీ ఇస్తామని, రాజధాని సెప్టెంబరులో ఖరారవుతుందని, లక్షన్నర కోట్లతో విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తామం టూ ప్రకటించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జైరాం హామీలకు సంబంధించిన సీడీని, పత్రికల కథనాలను బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది.