ముగిసిన వర్షాకాల సమావేశాలు
ఉభయ సభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 19 సార్లు సమావేశమైన లోక్‌సభ.. బ్యాంకింగ్(సవరణ) చట్టం సహా 14 బిల్లుల్ని ఆమోదించింది. ఈ సమావేశాల్లోనే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగ్గా.. ప్రవర్తన సరిగా లేదంటూ లోక్‌సభలో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. వాడివేడి∙చర్చలు, అధికార, ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. గోరక్షణ హత్యలు, అల్లరి మూకల దాడులు, వ్యవసాయ సంక్షోభం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాడి అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు సభా కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి.
క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ కొనసాగింది. లోక్ సభ మొత్తం 71 గంటలు సమావేశం కాగా.. నిరసనలతో 29.58 గంటలు వృథా అయ్యాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. 63 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు, 4,370 ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారని.. మంత్రులు మొత్తం 1,270 ప్రకటనలు చేయగా.. 28 మంది సభ్యులు ప్రైవేట్ బిల్లుల్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
కంపెనీ (సవరణలు) బిల్లు 2016, నాబార్డ్(సవరణ) బిల్లు సహా పలు బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించింది. ఇక రాజ్యసభ 71 గంటలు సమావేశం కాగా.. ఆందోళనలతో 25గంటలు వృథా అయ్యా యి. క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికో త్సవంపై చర్చతో పాటు తీర్మానం చేశారు. కొత్త సభ్యులుగా వినయ్ టెండూల్కర్, సం పతీయ యుకేలు ప్రమాణస్వీకారం చేయగా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి, వెంకయ్య నాయుడు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆయుధ సంపత్తిపై సందేహం అక్కర్లేదు
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. టిబెట్ ప్రాంతంలో చైనా బలగాల మోహరింపుపై ఆయన ప్రశ్నకు స్పందించారు. పాక్ రక్షణ వ్యవస్థ భారత్‌కంటే మెరుగ్గా ఉందన్న ఆర్మీ అధికారి వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు.