ఇక సమరమే
► ముగిసిన రామ్‌నాథ్ కోవింద్, మీరాకుమార్ ప్రచారం
► నేడు ఎన్డీయే పక్షాల ఎంపీలతో మోదీ భేటీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ వ్యక్తిగతంగా పర్యటించి ప్రచారం పూర్తిచేసుకున్నారు. శనివారం ఒక్కరోజే మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లలో సుడిగాలి పర్యటన చేశారు. అటు కోవింద్ కోసం ఆదివారం ఎన్డీయే పక్ష ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. తటస్థంగా ఉన్న ఎంపీలు, పలురాష్ట్రాల ఎమ్మెల్యేలను మోదీ మద్దతుకోరనున్నారు.
మీరా కుమార్, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ సంయుక్తంగా ఆదివారం 18 పార్టీల విపక్ష కూటమి ఎంపీలకు ఢిల్లీలో తేనీటి విందు ఇవ్వనున్నారు. అయితే కాంగ్రెస్ నేతల్లోనూ కొందరు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పెట్టడం కన్నా ఎన్నిక ఏకగ్రీవం అయితేనే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకసారి మాత్రమే రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. రెండు సార్లు తీవ్రమైన పోటీ నెలకొనగా మిగిలినవి ఏకపక్షంగానే జరిగాయి.
ఆ రెండు సందర్భాల్లో..
కాంగ్రెస్ అభ్యర్థి జకీర్ హుస్సేన్, విపక్షాల అభ్యర్థి కోకా సుబ్బారావు (తూర్పుగోదావరి, ఏపీ) మధ్య 1967 రాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన కోకా సుబ్బారావుకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించింది. ఈ ఎన్నికల్లో సుబ్బారావు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తెలుగు వర్సెస్ తెలుగు
1969లో జాకీర్ హుస్సేన్ హఠాన్మరణంతో మరోసారి రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ సారి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి (ఇద్దరూ తెలుగువారే) మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు నీలం సంజీవరెడ్డిని (నాటి లోక్‌సభ స్పీకర్) అభ్యర్థిగా ప్రకటించింది.
అయితే నామినేషన్‌కు ముందు ఉపరాష్ట్రపతి వీవీ గిరి నామినేషన్ వేసి (ఇందిర ప్రోత్సాహంతో) అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని ఇందిర ప్రకటించినా తెరవెనుక రాజకీయాలతో తన అభ్యర్థి వీవీ గిరిని గెలిపించుకున్నారు. నిజలింగప్ప, కామరాజ్ నాడర్, మొరార్జీ దేశాయ్, అతుల్య ఘోష్, ఎస్‌కే పాటిల్ మొదలైన వారి నుంచి ఇందిరకు పార్టీలోనే తీవ్రమైన అసమ్మతి ఎదురైంది. అయితే 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంజీవరెడ్డిని రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా గెలిపించుకుంది.
ఆమోదానికి 18 బిల్లులు
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 18 బిల్లులను ఆమోదం పొందాల్సిన బిల్లుల జాబితాలో చేర్చారని పరిశోధనా సంస్థ పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ శనివారం వెల్లడించింది. వీటిలో 9 బిల్లులను లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిందనీ, కొన్నింటిని రెండు సభలూ ఆమోదించాల్సి ఉందని పీఆర్‌ఎస్ పేర్కొంది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి.