న్యూఢిల్లీ: కిడ్నీల కుంభ కోణం సూత్రధారి డాక్టర్ అమిత్ కుమార్‌కు చెందిన రూ.4 కోట్ల విలువైన విదేశీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. మెల్‌బోర్న్‌లోని సన్బరీ ప్రాంతంలో ఉన్న కుమార్‌కు చెందిన అత్యంత ఖరీదైన బంగళాను ఎవరూ కొనరాదని, లీజుకు సైతం తీసుకోరాదని పేర్కొంటూ ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కిడ్నీల కుంభకోణం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక కోర్టు గత ఏడాది ఆస్ట్రేలియాకు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడి పోలీసులు చర్యలు తీసుకున్నట్టు ఈడీ వివరించింది. జ్యుడీషియల్ కస్టడీపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జైల్లో ఉన్న డాక్టర్ కుమార్‌కు సదరు ఆస్తుల అటాచ్‌మెంట్ విషయాన్ని ఈడీ అధికారులు గురువారం వెల్లడించారు.