న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2014-15లో కూడా ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీనే చెల్లించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మంగళవారం నిర్ణయించింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి నరేంద్రసింగ్ తొమర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక సంస్థ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ లాంఛనంగా ఆమోదించి అమలు చేయాల్సి ఉంది. ఈపీఎఫ్‌వో 2012-13లో పీఎఫ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ చెల్లించగా 2013-14లో 8.75 శాతం వడ్డీ చెల్లించింది. ఈపీఎఫ్‌వోకు సుమారు 5 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.
మరోవైపు ఉద్యోగుల డిపాజిట్ అనుసంధాన బీమా (ఈడీఎల్‌ఐ) పథకం కింద అందించే ప్రయోజనాన్ని ప్రస్తుతమున్న రూ 1.56 లక్షల నుంచి గరిష్టంగా రూ. 3.60 లక్షలకు పెంచనున్నట్లు ఈపీఎఫ్‌వో కేంద్ర ప్రావిడెంట్ కమిషనర్ కె.కె.జలాన్ తెలిపారు. ఈడీఎల్‌ఐ కింద హామీ ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుతం రూ. 6,500గా ఉన్న నెలవారీ వేతన సీలింగ్ నిష్పత్తి ప్రకారం ఇస్తుండగా త్వరలోనే రూ. 15 వేలకు పెంచనున్నారు. వేతన సీలింగ్ పెంపుతోపాటు ఈపీఎఫ్‌వో అందించే ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలకు రూ. వెయ్యి కనీస పెన్షన్ చెల్లింపుపై నోటిఫికేషన్లను త్వరలోనే అమలు చేస్తామని కార్మికశాఖ అధికారులు ట్రస్టీల బోర్డు సమావేశంలో పేర్కొన్నారు.
ఈపీఎఫ్ వడ్డీ 8.75%
Published Wed, Aug 27 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement