
మావోయిస్టులకు యూరప్ నుంచి అండదండలు
మన దేశంలోని మావోయిస్టులకు జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్, ఇటలీ లాంటి యూరోపియన్ దేశాల నుంచి సాయం అందుతోంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్వయంగా తెలిపింది. ఈ విషయాన్ని ఆయా యూరోపియన్ దేశాలతో చర్చిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో తెలిపారు. ఫిలిప్పీన్స్, టర్కీ దేశాలలోని వామపక్షాలతో కూడా మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఫిలిప్పీన్స్కు చెందిన సీనియర్ కేడర్ భారతదేశంలో 2005, 2011లో శిక్షణ పొందారని ఆయన చెప్పారు.
వివిధ ఎన్కౌంటర్లు, కూంబింగ్ ఆపరేషన్ల సమయంలో విదేశాలకు చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వామపక్ష తీవ్రవాదుల నుంచి మన భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయని రిజిజు వివరించారు. దీంతో.. వాళ్లు వివిధ దేశాల నుంచి ఆయుధాలు సేకరిస్తున్నట్లు స్పష్టం అవుతోందన్నారు. మావోయిస్టులకు విదేశాల నుంచి నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.