‘బుల్లెట్లు కూడా నన్ను పడగొట్టలేవ్’
న్యూఢిల్లీ: ‘గుడ్లు, రాళ్లు మర్చిపోండి.. వాళ్లు బుల్లెట్లు నాపై ప్రయోగించినా కూడా ఏమీ చేయలేరు’అనే బిజు జనతాదల్ పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు జై పాండా (53)అన్నారు. మంగళవారం తన నియోజకవర్గంలో ఓ నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించేందుకు వచ్చిన ఆయనపై అదే పార్టీకి చెందిన కొంతమంది ఆయన వ్యతిరేక వర్గానికి చెందినవారు రాళ్లు, గుడ్లతో దాడులు చేశారు. దీంతో పాండా వర్గం వాళ్లు కూడా ప్రత్యర్థులపై దాడులకు దిగారు. ఈ నేపథ్యంలోనే ‘రాళ్లు, కోడిగుడ్లు ప్రత్యర్థులపై విసరడం మర్చిపోవాలి. వారు తనపై బుల్లెట్లు ప్రయోగించినా ఏం కాదు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీతో చేతులు కలిపి సొంత పార్టీని చీల్చే కుట్రలు చేస్తున్నారంటూ పాండాపై బీజేడీ నాయకుడు తథాగత సత్పతి తీవ్ర ఆరోపణలు చేశారు. పరిణామాలు కూడా అలాగే కనిపించడంతో ఆయనను పార్టీ అధికారిక ప్రతినిథి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో నేరుగా సొంతపార్టీపైనా, పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై కూడా పాండా రెచ్చిపోయి మాటలన్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా తనపై చర్యలు తీసుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటి నుంచి బీజేడీలోనే రెండు అనుకూల వ్యతిరేక వర్గాలు ఏర్పడి నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి.