న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ వ్యవహారంలో గత యూపీఏ ప్రభుత్వం మళ్లీ ఇరకాటంలో పడింది. అత్యున్నతస్థాయిలో వచ్చిన రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఇష్రత్ జహాన్ కేసు రెండో అఫిడవిట్‌లో మార్పులు చేసినట్టు మాజీ బ్యూరోక్రాట్ ఒకరు వెల్లడించారు. ఇష్రత్ జహన్ ఎన్‌కౌంటర్ కేసులో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు అఫిడవిట్లను కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇష్రత్ జహాన్, జావేద్ షైక్ అలియాస్ ప్రాణేశ్ పిళ్లై, జీషాన్ జోహర్, అంజద్ అలి రాణాలు ఉగ్రవాదులేనని మొదటి అఫిడవిట్‌లో పేర్కొన్న యూపీఏ సర్కారు సరిగ్గా రెండు నెలల్లోనే యూ టర్న్ తీసుకొంది. ఆ నలుగురు ఉగ్రవాదులు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవంటూ రెండో అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది.
అయితే తనను భౌతికంగా హింసించడంతోనే ఆ రెండో అఫిడవిట్ తాను సంతకం చేశానని ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్గత భద్రత విభాగం అండర్ సెక్రటరీగా పనిచేసి రిటైరైన ఆయన.. రాజకీయ ఒత్తిడుల కారణంగానే తాను రెండో అఫిడవిట్‌పై సంతకం చేసినట్టు చెప్పారు. ఇష్రత్ కేసులో ఆధారాలను కల్పితంగా సృష్టించారని, అంతేకాకుండా గుజరాత్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల పేర్లను కూడా ఈ కేసులో ఇరికించాలని సిట్ తనపై ఒత్తిడి చేసిందని ఆయన వెల్లడించారు. ఇష్రత్ జహాన్ కేసులో పత్రాల ఆధారంగా స్పష్టమైన అఫిడవిట్ రూపొదిస్తుంటే అప్పటి సీబీఐ అధికారి సతీశ్ శర్మ జోక్యం చేసుకొని తనను భౌతికంగా వేధించాడని, తన తొడలపై సిగరెట్ పీకలతో కాల్చేవాడని ఆయన వెల్లడించారు. తొలి అఫిడవిట్ ను తాను ఆమోదించలేదని చెప్తున్న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు.
మాజీ బ్యూరోక్రాట్ ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. ఇష్రత్ జహాన్ కేసు ద్వారా అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీని టార్గెట్‌గా చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు.
టార్చర్ పెట్టి సంతకం చేయించుకున్నారు!
Published Wed, Mar 2 2016 12:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement