సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమవుతోందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ‘ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ’ పేరుతో ఆయన రాసిన వ్యాసం ప్రచురితమైంది.
‘పేదరికాన్ని చాలా దగ్గరి నుంచి చూశానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారు. ఆ పేదరికాన్ని భారతీయులందరూ కూడా దగ్గర నుంచి చూసేలా చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహర్నిశలు శ్రమిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. రంగాల వారీగా ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని విమర్శించారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయని ఆరోపించారు. పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా నాశనమైందని పేర్కొన్నారు. ‘వ్యవసాయం పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇక నిర్మాణ రంగం మందకొడిగా సాగుతోంది.
సేవల రంగంలో స్తబ్దత నెలకొంది. ఎగుమతులు క్షీణించాయి’ అని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కోలుకోలేని ఆర్థిక విపత్తుగా యశ్వంత్ సిన్హా అభివర్ణించారు. భారీగా ఊహించుకుని, ఘోరంగా అమలు పరిచారంటూ జీఎస్టీ అమలును దుయ్యబట్టారు. ఈ నిర్ణయాల వల్ల వ్యాపార రంగం తీవ్రంగా నాశనమైందన్నారు. వృద్ధి రేటు రానురాను తగ్గిపోతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.7 శాతానికి చేరుకుందని వెల్లడించారు. ‘నా వ్యాఖ్యలతో బీజేపీలోని చాలామంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలుసు. కానీ ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే.. భారతీయుడిగా నా బాధ్యతను విస్మరించినట్లే’ అని పేర్కొన్నారు.
ప్రపంచానికి తెలుసు: రాజ్‌నాథ్
యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. ఈ నిజాన్ని ఎవరూ మరిచిపోకూడదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ విశ్వసనీయత సంపాదించుకుంది’ అని స్పష్టం చేశారు.
18 నెలలుగా ఇదే చెబుతున్నాం..: చిదంబరం
దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతుంటే ప్రభుత్వం తమ నోరు మూయిస్తూ వచ్చిందని, గత 18 నెలలుగా కాంగ్రెస్ చెబుతున్న దాన్నే యశ్వంత్ సిన్హా తన వ్యాసంలో చెప్పారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ‘నినాదాల’తో ఇంకా ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. ‘యశ్వంత్ సిన్హా నిజం మాట్లాడారు. దీనిపై మేం హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా అభిప్రాయాలు ఆయన ద్వారా ప్రతిధ్వనించాయి’ అని వ్యాఖ్యానించారు.Criticisms