గుర్మీత్‌ను వదిలేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు?
గుర్మీత్ కేసులో రాజకీయ ఒత్తిళ్లు?
Published Sat, Aug 26 2017 2:21 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా ప్రకటించిన అనంతరం జరుగుతున్న హింసాత్మక పరిణామాలు తెలిసిందే. రాజకీయ నేతలను, సెలబ్రిటీలను దైవం పేరుతో తన గుప్పిట్లో పెట్టుకున్న డేరా చీఫ్ విషయంలో సీబీఐ పారదర్శక దర్యాప్తుతోనే బాధితులకు న్యాయం జరిగిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసు విచారణలో ఉండగా దర్యాప్తు సంస్థపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు కూడా వచ్చాయని చెబుతున్నారు ఈ కేసు విచారణ చేపట్టిన ఓ అధికారి.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ములిన్జా నారాయణన్ ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. డిసెంబర్ 12, 2002 లో పంచకుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు అత్యాచార ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. సబ్ ఇన్‌స్పెక్టర్ హోదా నుంచి నేరుగా సీబీఐ జాయింట్ డైరక్టర్ పగ్గాలతోపాటు గుర్మీత్ కేసును కూడా ములిన్జాకు ప్రభుత్వం అప్పగించింది. ‘ఆ సమయంలో సీబీఐలోని ఓ ఉన్నతాధికారి నా గదిలోకి ప్రవేశించారు. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని, తక్షణమే కేసు మూసేయాలని సూచించారు’ అని ఆయన తెలిపారు.
అయితే కేసులో చాలా విషయం ఉందని గుర్తించిన ములిన్జా మరింత లోతుగా విచారణ చేపట్టారంట. మరోవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే చాలా మంది బడా నేతలు, వ్యాపార వేత్తలు దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యలయానికి వచ్చి కేసు మూసేయాలంటూ ఒత్తిళ్లు చేశారంటూ ఆరోపించారు. అయినప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని, ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని 67 ఏళ్ల ములిన్జా వ్యాఖ్యానించారు.
ఇక కేసులో బాధిత మహిళలో ఒకరిని కనిపెట్టడం చాలా కష్టతరంగా మారిందని ఆయన చెప్పారు. 1999 లో ఆమె గుర్మీత్ చేతిలో లైంగిక దాడికి గురయ్యాక డేరా(ఆశ్రమం) వదిలి వెళ్లిపోయారని, ఆమె వివాహం చేసుకోవటంతో విచారణకు సహకరిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ ఆమె భర్త, కుటుంబ సభ్యులు బాగా సహకరించారని తెలిపారు. విచారణ సమయంలో గుర్మీత్ కూడా తాను బాబానంటూ పరోక్షంగా బెదిరించేందుకు యత్నించారంటూ ములిన్జా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఆటలో ఒక్కోసారి మేం గెలవచ్చు.. ఒక్కోసారి ఓడిపోవచ్చు.. కానీ, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ములిన్జా పేర్కొన్నారు.
Advertisement
Advertisement