బీఎంసీ ఎన్నికలు: శ్రద్ధా జాదవ్ రికార్డు విజయం
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల కౌటింగ్‌లో శివసేన దూకుడు కొనసాగిస్తోంది. బీఎంసీ మాజీ మేయర్, శివసేన నాయకురాలు శ్రద్ధా జాదవ్ ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో వరుసగా ఆరోసారి విజయం సాధించారు. వార్డ్ నెం.202 నుంచి ఆమె గెలుపొందారు. బీజేపీ ఎంపీ కిరిట్ సోమాలియా కుమారుడు నియిల్ వార్డు నెం.108 నుంచి విజయం సాధించగా, ముంబై బీజేపీ విభాగం చీఫ్ అశిష్ షెలార్ సోదరుడు వినోద్ షెలార్ వార్డ్ నెం.51లో ఓటమి పాలయ్యారు.
మరోవైపు 227 వార్డులున్న బీఎంసీలో కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ శివసేన హవా కొనసాగుతోంది. వందకు పైగా వార్డుల్లో శివసేన ఆధిక్యంలో ఉండగా, బీజేపీ మాత్రం 50 వార్డుల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు అధిక స్థానాలు గెలుచుకునేలా కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేటి (గురువారం) ఉదయం ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది. ఫలితాలు రాకముందే శివసేన పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తుండటం గమనార్హం.