శివసేనకు ఠాక్రేల కోడలి ఝలక్!
శివసేనకు ఠాక్రేల కోడలి ఝలక్!
Published Tue, Feb 21 2017 4:56 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి... సరిగ్గా ఇలాంటి సమయంలోనే శివసేన నాయకులకు ఝలక్ ఇచ్చేలా ఠాక్రేల కోడలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలా ఠాక్రే నుంచి విడిపోయిన కొడుకు జైదేవ్ ఠాక్రే మాజీ భార్య అయిన స్మితా ఠాక్రే.. బీఎంసీలో అవినీతి గురించి తీవ్రంగా మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా బీఎంసీలో బీజేపీ - శివసేన సంకీర్ణ పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీలో ఉన్నాయి. ముంబైలో చాలావరకు రోడ్ల నిండా గుంతలు ఉన్నాయని, బీఎంసీలో అవినీతి ఎప్పటికీ పరిష్కారం కాకుండానే ఉండిపోయిందని ఆమె అన్నారు. 2004లో జైదేవ్ ఠాక్రే నుంచి విడాకులు తీసుకునేవరకు ఆమె కూడా బాలా ఠాక్రే సొంత ఇల్లయిన 'మాతోశ్రీ'లోనే ఉండేవారు.
బీఎంసీలో పనులు ఏమాత్రం జరగవని, ఫైళ్లు కదదలవని స్మితా ఠాక్రే విమర్శించారు. తాను ఠాక్రే కుటుంబం నుంచి వచ్చిన మహిళను అయినా.. తాను కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నానన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనల మధ్య గట్టి పోటీగా ఈసారి బీఎంసీ ఎన్నికలు ఉంటున్నాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలోని మరో తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక చాలా కాలంగా ఓట్లు వేస్తూ వచ్చిన చాలామంది ఈసారి ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓట్లు వేయలేకపోతున్నారని.. దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) పలు కీలకమైన అంశాలను లేవనెత్తుతోందని, ఈసారి ఎన్నికల్లో వాళ్లకు తగినన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందని కూడా స్మితా ఠాక్రే అన్నారు.
Advertisement
Advertisement