మితిమీరిన జోక్యం సరైంది కాదు
న్యాయవ్యవస్థపై జస్టిస్‌శ్రీకృష్ణ
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ మితిమీరిన జోక్యంతో ఇబ్బందులు తప్పవని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనివల్ల శాసన, న్యాయవ్యవస్థలు నష్టపోతాయన్నారు. ‘న్యాయమూర్తుల పాత్ర క్రికెట్‌లో అంపైర్‌లా ఉండాలి. ఆటగాళ్లు నిబంధనలకు అనుగుణంగా ఆడుతున్నారా లేదా చూడాల్సిన బాధ్యత అంపైర్‌ది. అంతేకాని బ్యాట్స్‌మన్ ఆడటం లేదని తనే బ్యాట్ తీసుకుని సిక్స్ కొట్టాలనుకోకూడదు’ అని మంగళవారం ఢిల్లీలో ‘పార్లమెంటు, న్యాయవ్యవస్థ’అనే అంశంపై జరిగిన సదస్సులో చెప్పారు.
ఆర్టికల్ 21 (ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించే)ను కాపాడేందుకు ఆర్టికల్ 142 (స్వతంత్ర అధికారం)ను న్యాయవ్యవస్థ వినియోగించుకోవాలని చూస్తోందన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో, పూర్తి న్యాయం జరగటం లేదని అనుకున్నప్పుడు మాత్రమే సుప్రీం జోక్యం చేసుకునేందుకు అధికారం ఉందన్నారు. ‘పార్లమెంటు వ్యవస్థ నమ్మకాన్ని కోల్పోతోంది. ఆ స్థానాన్ని న్యాయవ్యవస్థ భర్తీ చేస్తోంది. అలాగని న్యాయవ్యవస్థ మితిమీరిన జోక్యం చేసుకోకూడదు. పౌరులు ఓట్లేస్తేనే దేశం నడుస్తోంది. న్యాయమూర్తులు దేశాన్ని నడిపించలేరు’అని బీఎన్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు.