రాంగోపాల్ యాదవ్ బహిష్కరణపై మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాంగోపాల్ యాదవ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మూడు వారాల క్రితం బహిష్కరణ వేటు వేసినప్పటికీ ఆయన ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతుండటం విశేషం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరయ్యారు. ఎస్పీ ఫ్లోర్ లీడర్ అయిన ఆయన నిన్న సమావేశాలకు హాజరై యథాతథంగా తన సీటులో కూర్చున్నారు.
అంతేకాకుండా రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై జరిగిన చర్చలో కూడా రాంగోపాల్ పాల్గొన్నారు. మహిళలు దాచుకున్న డబ్బు నల్ల ధనం కాదని, ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో మహిళలు వంద, రెండు వందులు దాచుకుంటారని, ఆ డబ్బు నల్లధనం కాదని ఆయన అన్నారు. మహిళలు ఎందుకు ఇబ్బందులు పడాలని రాంగోపాల్ యాదవ్ ప్రశ్నించారు. అలాగే తన ప్రసంగంలో ఆయన నేతాజీ అంటూ ఎస్పీ చీఫ్ యులాయం సింగ్ పేరును పలుసార్లు ప్రస్తావించారు.
మరోవైపు రాంగోపాల్ యాదవ్ సస్పెన్షన్పై తమకు ఎలాంటి సమాచారం అందలేదని రాజ్యసబ సెక్రటరీ వెల్లడించినట్లు సమచారం. కాగా సమాజ్వాదీ పార్టీలో ఇంటిపోరు రచ్చకెక్కడంతో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సన్నిహితుడు రాంగో పాల్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరంటూ ఆయనపై వేటు వేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ గురువారం రాంగోపాల్ యాదవ్ను ఎస్పీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు అధికార ప్రతినిధితో పాటు జనరల్ సెక్రటరీగా తిరిగి నియస్తున్నట్లు ప్రకటన చేసింది.