
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థ పేదలకు అందనంత ఖరీదైన వస్తువుగా మారిందని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) బీఎస్ చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను కూడా పెద్ద లాయర్లను నియమించుకునే స్థితిలో లేనన్నారు. ఖైదీల హక్కులపై తీహార్ జైలు శనివారం ఇక్కడ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. బెయిల్ షరతులు సంక్లిష్టం కావడంతో పేదలు జైలులోనే ఉండిపోయి శిక్షాకాలాన్ని పూర్తిచేస్తుండగా, ధనికులు ముందస్తు బెయిల్ పొందుతున్నారన్నారు. ‘మన న్యాయ వ్యవస్థ, బెయిల్ షరతులు ఎందుకింత క్లిష్టమయ్యాయన్నదే అతి పెద్ద ప్రశ్న. పేదలకు కోర్టులను ఆశ్రయించే స్తోమత లేదు’ అని అన్నారు. న్యాయ వ్యవస్థను పేదలు, ధనికులకు చేరువ చేయడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్న పెద్ద లాయర్లను తప్పుపట్టారు.