
థియేటర్లలో జాతీయగీతంపై ఏమంటున్నారు?
న్యూఢిల్లీ: ఇక నుంచి ప్రతి సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ నిలబడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పలువురు నిపుణుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఇది న్యాయవ్యవస్థ మితిమీరిన జోక్యం అని కొందరు అంటుండగా.. తాజా ఆదేశాల ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, మంచి ఫలితాన్నే ఇస్తుందని మరొకరు అంటున్నారు. ముఖ్యంగా మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ ఈ విషయంపై స్పందిస్తూ కోర్టులు ప్రజలు నిల్చోవాలని, ఏదో చేయాలని చెప్పకూడదని అన్నారు.
కావాలంటే కార్యనిర్వాహక వర్గాన్ని మాత్రం చట్టంలో సవరణలు చేయండని ఆదేశించవచ్చని చెప్పారు. మరోపక్క, తనకు సంబంధించినది కానీ అంశాల వరకు న్యాయవ్యవస్థ వెళ్లకూడదని ప్రముఖ సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి అన్నారు. ఇక ఢిల్లీ నియోజవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, న్యాయవాది మీనాక్షి మాత్రం సానూకూలంగా స్పందించారు. జాతీయ గీతాన్ని ఇప్పటికే పలు పాఠశాలల్లో.. బహిరంగంగా జరిగే వేడుకల్లో, తదితర చోట్లలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారని, ఇప్పుడొక కొత్త వేదికపై పాడితే తప్పేముందని, ఎలాంటి నష్టం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. జాతీయ గీతం వచ్చే సమయంలో లేచి నిల్చుంటే కలిగే నష్టమేమి లేదన్నారు. అయితే, థియేటర్‌లో ప్రతి ఒక్కరు నిల్చొనేలా చేయడం యాజమాన్యాలకు కష్టంగా ఉంటుందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో ఈ సమస్య ఉంటుందని అన్నారు.