ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో రాజకీయాలకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతున్నారా, అయితే మీ ఇంటికి ఎఫ్‌బీ ప్రతినిధి రావొచ్చు. సదరు పోస్ట్ మీరే పెట్టారా, లేదా అనేది ధ్రువీకరించుకోవడానికి ఫేస్‌బుక్ ప్రతినిధి మీ తలుపు తట్టొచ్చు. రాజకీయ పోస్ట్ పెట్టిన ఢిల్లీవాలా ఇంటికి ఎఫ్‌బీ ప్రతినిధి వచ్చి ఆరా తీసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఫేస్‌బుక్ ప్రతినిధి తనింటికి వచ్చి ఆధార్‌కార్డు అడిగినట్టు ‘ఐఏఎన్‌ఎస్’ వార్తా సంస్థతో ఢిల్లీవాసి ఒకరు చెప్పారు.
‘పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసులు వచ్చినట్టుగా ఫేస్‌బుక్ ప్రతినిధి మా ఇంటికి వచ్చారు. ఫేస్‌బుక్‌లో రాజకీయాలకు సంబంధించిన పోస్ట్ పెట్టింది నేనో, కాదో తెలుసుకునేందుకు నా ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు చూపించాలని అడిగారు. ఫేస్‌బుక్ ప్రతినిధి నేరుగా మా ఇంటికి రావడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఘటన ఎక్కడా జరిగినట్టు నేను వినలేదు. యూజర్ ప్రైవసీ మాటేంటి? ప్రభుత్వం తరుపున ఇదంతా చేస్తున్నారా’ అని ఆయన ప్రశ్నించారు. తన పేరు, వివరాలు వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు తాము పంపిన ఈ-మెయిల్స్‌కు ఫేస్‌బుక్ స్పందించలేదని ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ తెలిపింది.
తమ ప్రతినిధిని పంపించి యూజర్ వివరాలు ప్రత్యక్షంగా తనిఖీ చేయడం ప్రైవసీ ఉల్లంఘన కిందకు వస్తుందని సైబర్ లా నిపుణుడు, సుప్రీంకోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్ తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని వివరించారు. ఈ వ్యవహారంలో 2000 ఐటీ చట్టప్రకారం ఫేస్‌బుక్‌పై దావా వేయొచ్చని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment