సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు అంతా ఇంతా కాదు. వారు ఓపిక పట్టలేక కాలి నడకన ఇళ్లకు బయల్దేరారంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వలస కార్మికులు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నది అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
1. వలస కార్మికులు ఓపిక లేక ఇంటిబాట పట్టలేదు. వారికి ఉపాధి పోయింది కనుక ఇంటి బాట పట్టారు.
2. వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే. ఇంటి అద్దె కట్టలేక, తినడానికి ఇంత తిండిలేక ఇంటి బాటపట్టారు.
3. లాక్‌డౌన్ కారణంగా 80 శాతం మంది పట్టణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ నిర్వహించిన సర్వే లెక్కలు తెలియజేస్తున్నాయి. 16 శాతం పట్టణ వాసులకు వారానికి సరిపడా నిత్యావసర సరకులను కొనుగోలుచేసే శక్తి లేదు.
4. లాక్‌డౌన్ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు ఏ మూలకు సరిపోలేదు. మరోపక్క ప్రభుత్వ గిడ్డంకుల్లో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు కుళ్లిపోయాయి.
5. వలస కార్మికుల తరలింపునకు వేసిన ప్రత్యేక శ్రామిక రైళ్లు వారికి ఏ మూలకు సరిపోలేదు. ఆ రైళ్లు ఎక్కిన వలస కార్మికులు అన్న పానీయాల కోసం అలమటించారు.
6. మే 9వ తేదీ నుంచి మే 27వ తేదీ మధ్య ఆకలితో, ఎండ తీవ్రతను తట్టుకోలేక రైళ్లలో 80 మంది వలస కార్మికులు మరణించారు. ఈ విషయాన్ని రైల్వే రక్షణ దళమే తెలియజేసింది.
7. వలస కార్మికుల కష్టాలు ఐదు రోజులో, ఐదు వారాలో కొనసాగలేదు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యాలను ప్రభుత్వం రద్దు చేయడంతో వలస కార్మికులు దొరికిన వాహనాన్ని ఎక్కిపోవడానికి ప్రయత్నించడమే కాకుండా, కాలినడకన కూడా స్వస్థలాలకు బయల్దేరారు. రోడ్డు మార్గాల్లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 200 మంది కార్మికులు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment