సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు, పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్‌భూమికి వెళ్లి సోమవారం ఉదయం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజీవ్ కూతురు ప్రియాంక వాద్రా ఆమె భర్త రాబర్ట్ వాద్రా, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ సేవల్ని వారు స్మరించుకున్నారు. టెక్నాలజీ(ఐటీ) రంగాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరం ఎంతో ఉందని గ్రహించిన ప్రధాని రాజీవ్ అని పేర్కొన్నారు.
కాగా, 1944 ఆగస్ట్ 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా పని చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడు లోని పెరంబదూర్లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబును ప్రయోగించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కాగా ఇటీవల రాజీవ్ కుమారుడు రాహుల్ గాంధీ సింగపూర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా తండ్రిని హత్య చేసిన వారికి క్షమిస్తున్నాను. నా సోదరి ప్రియాంక వారిని ఎప్పుడో క్షమించ్చేసింది. ప్రజలను ద్వేషించడం మాకు చాలా కష్టం’ అంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment