Vir Bhumi
-
మాజీ ప్రధాని రాజీవ్‌కు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు, పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్‌భూమికి వెళ్లి సోమవారం ఉదయం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజీవ్ కూతురు ప్రియాంక వాద్రా ఆమె భర్త రాబర్ట్ వాద్రా, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ సేవల్ని వారు స్మరించుకున్నారు. టెక్నాలజీ(ఐటీ) రంగాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరం ఎంతో ఉందని గ్రహించిన ప్రధాని రాజీవ్ అని పేర్కొన్నారు. కాగా, 1944 ఆగస్ట్ 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా పని చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడు లోని పెరంబదూర్‌లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబును ప్రయోగించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కాగా ఇటీవల రాజీవ్ కుమారుడు రాహుల్ గాంధీ సింగపూర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా తండ్రిని హత్య చేసిన వారికి క్షమిస్తున్నాను. నా సోదరి ప్రియాంక వారిని ఎప్పుడో క్షమించ్చేసింది. ప్రజలను ద్వేషించడం మాకు చాలా కష్టం’ అంటూ వ్యాఖ్యానించారు. -
రాజీవ్‌కు ‘మహా’ నివాళి
ముంబై: నగరంలో కాంగ్రెస్ నేత, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజీవ్ గాంధీ భవన్లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు ఆర్పించారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మంత్రాలయకు చేరకున్న సీఎం పృథ్వీరాజ్ చవాన్ అక్కడ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంతో పాటు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రాజకీయాల్లో మంచి మార్పు తీసుకొచ్చిన నేత అని స్మరించుకున్నారు. కాగా, నగరంలోని రాజ్ భవన్లో గవర్నర్ కె.శంకర్ నారాయణన్ సిబ్బం దితో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చెయ్యించారు. -
'వీర్ భూమి' వద్ద రాజీవ్‌కు నేతల నివాళి
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 69వ జయంతి సందర్భంగా జాతి యావత్తు ఆయన్ని స్మరించుకుంది. న్యూఢిల్లీలోని 'వీర్ భూమి' వద్ద మంగళవారం ప్రముఖ నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా, అల్లుడు రాబర్డ్ వాద్రా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అంజలి ఘటించారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్, ఆర్థికమంత్రి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, ఆస్కార్ ఫెర్నాండేజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు హైదరాబాద్ గాంధీభవన్‌లో రాజీవ్ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు జ్యోతి వెలిగించి అనంతరం రాజీవ్ చిత్రపటానికి పూలుమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, వట్టి వసంత్ కుమార్, వీ హనుమంతరావు, ఆకుల లలిత తదితరులు పాల్గొని రాజీవ్‌ను అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను వక్తలు కొనియాడారు. అంతకుముందు సోమాజిగూడ వద్ద ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.