'వీర్ భూమి' వద్ద రాజీవ్కు నేతల నివాళి
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 69వ జయంతి సందర్భంగా జాతి యావత్తు ఆయన్ని స్మరించుకుంది. న్యూఢిల్లీలోని 'వీర్ భూమి' వద్ద మంగళవారం ప్రముఖ నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా, అల్లుడు రాబర్డ్ వాద్రా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్ మీరాకుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్, ఆర్థికమంత్రి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, ఆస్కార్ ఫెర్నాండేజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు హైదరాబాద్ గాంధీభవన్లో రాజీవ్ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు జ్యోతి వెలిగించి అనంతరం రాజీవ్ చిత్రపటానికి పూలుమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, వట్టి వసంత్ కుమార్, వీ హనుమంతరావు, ఆకుల లలిత తదితరులు పాల్గొని రాజీవ్ను అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను వక్తలు కొనియాడారు. అంతకుముందు సోమాజిగూడ వద్ద ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.