అభిమాన లోకం.. కన్నీటి శోకం | Fans and actors pay last respects to female superstar Sridevi | Sakshi
Sakshi News home page

అభిమాన లోకం.. కన్నీటి శోకం

Published Thu, Mar 1 2018 2:58 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM

Fans and actors pay last respects to female superstar Sridevi - Sakshi

ముంబైలోని సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ నుంచి మొదలైన శ్రీదేవి అంతిమయాత్రకు భారీగా హాజరైన అభిమానులు

సినీలోకం మూగబోయింది. అభిమానం అశ్రుధారలైంది. గుండెగొంతులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. ముంబై దారులన్నీ కన్నీటి వరదలయ్యాయి! లక్షలాది అభిమానులు వెంటరాగా దేవకన్య శ్రీదేవి దివికేగింది. బుధవారం సాయంత్రం ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్‌ చితికి నిప్పంటించారు.

సాక్షి, ముంబై: సినీలోకం మూగబోయింది. అభిమానం అశ్రుధారలైంది. గుండెగొంతులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. ముంబై దారులన్నీ కన్నీటి వరదలయ్యాయి! లక్షలాది అభిమానులు వెంటరాగా దేవకన్య శ్రీదేవి దివికేగింది. బుధవారం సాయంత్రం ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి(54) అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్‌ చితికి నిప్పంటించారు. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలు తండ్రి పక్కనే ఉన్నారు. అంతకుముందు సెలబ్రేషన్స్‌ క్లబ్‌ నుంచి తెల్లని పూలతో అలంకరించిన వాహనంపై శ్రీదేవి పార్థివదేహాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఆమెను కడసారి చూసేందుకు దారిపొడగునా అభిమానులు బారులుతీరారు. విలేపార్లే శ్మశానవాటికకు కుటుంబీకులు, సన్నిహితులు, పలువురు సినీతారలు మాత్రమే హాజరయ్యారు. అభిమానుల తాకిడి ఎక్కువకావటంతో షారుక్‌ఖాన్, సోనమ్‌ కపూర్‌ తదితరులు తమ వాహనాన్ని దూరంగా నిలిపేసి నడుస్తూ శ్మశాన వాటికకు చేరుకున్నారు.

ఆ దారి.. అభిమాన సంద్రం
అంతిమయాత్ర అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ నుంచి ఈ యాత్ర మొదలైంది. త్రివర్ణ పతాకం కప్పిన శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వాహనం ముందు, వెనుక శ్రీదేవి ఫొటోలను ఉంచారు. భర్త బోనీకపూర్, ఇద్దరు పిల్లలు, ఇంకొందరు కపూర్‌ కుటుంబీకులు భౌతికకాయంతో వాహనంలో ఉండగా.. మిగిలిన వారంతా కార్లలో శ్మశానవాటికకు చేరుకున్నారు. శ్రీదేవిని చివరిసారి చూసేందుకు అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్దఎత్తున బారులు తీరడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన అంతిమ యాత్ర సాయం త్రం 4 గంటలకు శ్మశానవాటికకు చేరుకుంది. ఉదయమే క్లబ్‌ వద్ద అభిమాను లను అదుపు చేసేందుకు 200 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉద్విగ్న క్షణాలు..
సెలబ్రేషన్‌ క్లబ్‌లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. హాల్‌ మధ్యలో పూలతో అలంకరించిన టేబుల్‌పై శ్రీదేవి పార్థివదేహాన్ని ఉంచారు. ఓవైపు వీఐపీల కోసం మరోవైపు అభిమానుల కోసం బారికేడ్లు కట్టారు. బాక్స్‌కు ముందు ఓ ఫొటో పెట్టి దాని ముందు దీపం ఉంచారు. గదిలో ఓ మూల నిలబడ్డ బోనీ కపూర్‌ను, జాహ్నవి, ఖుషిలను సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓదార్చారు. బాలీవుడ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా బోరున విలపించటంతో.. పక్కనే ఉన్న కరణ్‌ జోహార్‌ ఆయన్ను ఓదార్చారు. రాణీ ముఖర్జీ చాలాసేపు భౌతికకాయం వద్దే కూర్చున్నారు. రోదిస్తున్న సోనమ్‌ కపూర్‌ను ఓదార్చారు. సినీ ప్రముఖులంతా ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ.. బోనీ, పిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘శ్రీదేవిని కడసారి చూసొచ్చాను. సినీ పరిశ్రమ అంతా మౌనంగా రోదిస్తోంది. అదే శ్రీదేవి గొప్పదనం. అందమైన ఎర్రని చీరలో ప్రశాంతంగా ఆమె పడుకుని ఉంది’అని హేమమాలిని ట్వీట్‌ చేశారు.

అభిమానుల నిరాశ
ఉదయం నుంచే క్లబ్‌ ముందు పెద్దసంఖ్యలో అభిమానులు వేచి ఉన్నా.. 10 గంటల సమయంలో వీరిని లోపలకు అనుమతించారు. అయితే భారీగా తరలిరావడంతో కొంద రికే ఆఖరిచూపు దక్కింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు చివరి చూపు కోసం వచ్చారు. వీఐపీలు వచ్చినపుడల్లా అభిమానుల క్యూను ఆపేశారు. దీంతో చాలా మందికి లోపలకు వెళ్లే అవకాశం రాలేదు. శ్రీదేవి అంతిమయాత్ర వాహనాన్ని కూడా మూడువైపుల నుంచి మూసేశారు. ఆమెను చివరిసారిగా చూసేందుకు అభిమానులు చెట్లు ఎక్కారు. పక్కనున్న భవంతులపైకి చేరారు. ఫుట్‌ఓవర్‌పై నిలుచుని మరీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాక్సులో పెట్టడం, పువ్వులతో పెట్టను, వాహనాన్ని కప్పడంతో వారికి ఆమె ముఖం కనిపించలేదు. ఎక్కడ్నుంచో వచ్చినా చివరిచూపు దక్కలేదని వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.

దిగివచ్చిన తారాలోకం..
శ్రీదేవికి చివరి వీడ్కోలు పలికేందుకు తారాలోకం దిగివచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ సినీరంగాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ఖాన్, చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్, నాగార్జున, వెంకటేశ్, సంజయ్‌ కపూర్, హేమామాలిని, రేఖ, జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్, నగ్మా, సారికా, దీపికా పదుకొనే, రాకేశ్‌ రోషన్, సంజయ్‌ఖాన్, సురేశ్‌ ఒబెరాయ్, వివేక్‌ ఒబెరాయ్, షబానా ఆజ్మీ, జావేద్‌ అఖ్తర్, అనుపమ్‌ ఖేర్, సుస్మితా సేన్, సోనంకపూర్, కాజోల్, అజయ్‌ దేవగన్, టబూ, జయప్రద, సంజయ్‌ఖాన్, అక్షయ్‌ ఖన్నాతో పాటు పలు పార్టీల ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.


ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్నారు
భారత అధికారులు శ్రీదేవి పాస్‌పోర్టును రద్దుచేసి ఇతర దస్తావేజులను సిద్ధం చేస్తుండగానే.. పోలీస్‌ క్లియరెన్స్‌ కావాలంటూ జర్నలిస్టులు, అధికారులు, పలువురు స్థానిక భారతీయులు అశ్రఫ్‌కు ఫోన్‌ చేశారు. క్లియరెన్స్‌ తెచ్చిన తర్వాత దుబాయ్‌ సమీపంలోని ప్రభుత్వ మార్చురీకి చేరుకుని ఎంబామింగ్‌ ప్రక్రియ త్వరగా జరిగేలా చొరవ తీసుకున్నారు. అక్కడ అధికారులు శ్రీదేవితోపాటు మరో ముగ్గురి ఎంబామింగ్‌కు సంబంధించిన పత్రాలను అశ్రఫ్‌కు అందించారు. ఎంబామింగ్‌ సర్టిఫికెట్‌ అశ్రఫ్‌ పేరుతోనే జారీ కావడం గమనార్హం. అక్కడినుంచి మృతదేహాన్ని ఎయిర్‌పోర్టుకు తరలించి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. ఇదంతా పూర్తయ్యాక అశ్రఫ్‌ తన ఇంటికెళ్లాడు. ‘‘పెద్దల ఆశీర్వాదంతోనే ఈ పనిచేస్తున్నా. విదేశీయులు ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తరలించేందుకు ఏమేం చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారందరికీ నేను సాయం చేస్తా’ అని అశ్రఫ్‌ పేర్కొన్నారు. ‘‘శ్రీదేవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే ఉన్నారు. నిద్రపోతున్న అందాల రాణిలా..’’అని ఆయన తెలిపారు. సినిమాల్లో ఉన్నట్లుగానే ఆమె కనిపించారని.. ముఖంపై ఎలాంటి గాయాలూ లేవని వెల్లడించారు. 

ఎర్రని చీర.. నుదుట తిలకం..
మంగళ వారం రాత్రంతా  శ్రీదేవి నివాసం గ్రీన్‌ఏకర్స్‌లోనే ఉన్న శ్రీదేవి భౌతికకాయాన్ని.. బుధవారం ఉదయం 9 గంటలకు సెలబ్రేషన్‌ క్లబ్‌కు తరలించారు. శ్రీదేవికి ఇష్టమైన ఎరుపురంగు కాంచీవరం చీరతో మృతదేహాన్ని చుట్టారు. సెల బ్రేషన్‌ క్లబ్‌లో బోనీ, జాహ్నవి, ఖుషి, అనిల్‌ కపూర్, సంజయ్‌కపూర్, మేన ల్లుడు హర్షవర్ధన్‌ కపూర్, కోడలు సోనమ్, రేఖ కపూర్‌లు భౌతికకాయం వద్ద ఉన్నారు. ఇక్కడ సినీరంగ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిం చిన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవికి నివాళులర్పించారు. పార్థివ దేహంపై త్రివర్ణ పతాకం కప్పిన అనంతరం గన్‌ సెల్యూట్‌ చేశారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత అంతిమయాత్ర ప్రారంభమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement