
సాక్షి, చెన్నై : ‘మీరు సినిమాల్లో వరుసగా నటించుకుంటూ పోతే అభ్యంతరం లేదు. అయితే బీజేపీకి మద్దతు అనే వదంతులు జోరుగా షికార్లు చేస్తున్నాయి. అలాంటి వదంతులకు పుల్‌స్టాప్ పెట్టండి’అని నటుడు రజనీకాంత్‌కు ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానులకు పాతికేళ్ల నుంచి ఉన్న కల. వారిని ఊరిస్తూ వస్తున్న రజనీకాంత్ ఎట్టకేలకు గత 2017లో స్పందించాడు. అభిమానులను ఆహ్వానించి స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమంటపంలో వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
అదే విధంగా తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాహకులను ఏర్పాటు చేసి, సభ్యతం నమోదు భాధ్యతలను అప్పగించడంతో పాటు బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. నిర్వాహకులకు కోటి మంది సభ్యులుగా చేర్పించాలి్సందిగా టార్గెట్‌ను పెట్టారు.
పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశనే:
అలాంటి సమయంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని భావించిన అభిమానులకు రజనీకాంత్ ఆ ఎన్నికలకు దూరంగా ఉండటం కాస్త నిరాశనే కలిగించింది. అయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికలే మన లక్ష్యం. రానున్న శాసనసభ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీకి సిద్ధం అని రజనీకాంత్ ప్రకటించడం అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
వదంతులతో అయోమయం
కాగా ఇటీవల రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడటంతో, ఆ పార్టీకీ రజనీకాంత్ మద్దతునిస్తున్నారనే వదంతులు ప్రచారం అయ్యాయి. అందుకు ఆజ్యం పోసే విధంగా ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ఆ పదవి రనీకాంత్‌ను వరించబోతుందనే వదంతులు హల్‌చల్ చేశాయి. అయితే వీటిలో ఏ ఒక్క దానికి రజనీకాంత్ స్పందించకపోవడంతో రాజకీయ వాదులు, ముఖ్యంగా ఆయన అభిమానులు అయోమయంలో పడ్డారు.
పుల్‌స్టాప్ పడేనా?
మరో వైపు రజనీకాంత్ వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం దర్భార్ చిత్రంలో నటిస్తున్న ఆయన తదుపరి శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు, మళ్లీ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయన అభిమానులు చాలా అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా బీజేపీపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం వారిని అయోమయంలో పడేసింది. వారిప్పుడు ఈ వదంతులకు తలైవా పుల్‌స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నారు. రజనీకాంత్ వరుసగా సినిమాల్లో నటిస్తే తమకు అభ్యంతరం లేదు. అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన అభప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.