ఒక అవార్డు... ఎన్నో ప్రశ్నలు! | Dadasaheb Phalke Award To Superstar Rajinikanth Over Controversy Of The Timing | Sakshi
Sakshi News home page

ఒక అవార్డు... ఎన్నో ప్రశ్నలు!

Published Fri, Apr 2 2021 12:50 AM | Last Updated on Fri, Apr 2 2021 5:25 AM

Dadasaheb Phalke Award To Superstar Rajinikanth Over Controversy Of The Timing - Sakshi

రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు ప్రకటన అభిమానుల్లో ఆనందం రేపింది. కానీ, ప్రకటన సమయం, సందర్భం మాత్రం పరిశీలకుల నుంచి పలు విమర్శలకు దారి తీసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో వారం ఉండగా తమిళ సూపర్‌ స్టార్‌కు అవార్డు ప్రకటించడంతో పలువురు కళ్ళెగరేస్తున్నారు. జాతీయ అవార్డులు, పద్మ పురస్కారాల వెనుక రాజకీయాలు, గత వివాదాలపై మళ్ళీ చర్చ రేగింది.

రజనీకాంత్‌పై బి.జె.పి. అనుకూలుడనే ఓ ముద్ర ఉంది. నిజానికి, తమిళనాడు ఎన్నికలకు ముందు ఆయన రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన బలంగానే చేశారు. కానీ, ఇటీవల ‘అన్నాత్తే’ చిత్ర షూటింగు వేళ హైదరాబాద్‌ లో అస్వస్థతకు గురై, హాస్పటల్‌ పాలయ్యారు. ఆ వెంటనే గత డిసెంబర్‌లో పార్టీ ఆలోచనను విరమించుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ద్రవిడ పార్టీలదే హవా అయిన తమిళనాట ఎలాగైనా జెండా ఎగరేయాలని బి.జె.పి భావిస్తోంది. అందుకోసం రజనీకాంత్‌ పార్టీ ద్వారా పరోక్ష రాజకీయ లబ్ధి పొందాలని బి.జె.పి ప్రయత్నించినట్లు పరిశీలకుల వాదన. తీరా రజనీ పార్టీ పెట్టలేదు. దాంతో, ఆఖరు నిమిషంలో ఈ అవార్డు ప్రకటనతోనైనా ఓటింగులో తమిళ తంబీలను ప్రసన్నం చేసుకోవాలని బి.జె.పి. అనుకుంటున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

గతంలో... ఎవరెవరికి?
పద్ధతి ప్రకారం చూస్తే, ‘‘భారతీయ సినిమా పురోగతికీ, అభివృద్ధికీ అందించిన అత్యున్నతసేవలకు గుర్తింపుగా’’ భారత ప్రభుత్వమిచ్చే అత్యున్నత సినీ అవార్డు – ఈ ఫాల్కే అవార్డు. భారతీయ సినీ పితామహుడైన దాదాసాహెబ్‌ ఫాల్కే పేరు మీద 1969లో ఈ అవార్డును నెలకొల్పారు. ఫాల్కే అవార్డు దక్కిన 51వ సినీ ప్రముఖుడు రజనీకాంత్‌. 2019వ సంవత్సరానికి గాను రజనీకి ఈ అవార్డు ప్రకటించారు. గతంలో తమిళంలో హీరో శివాజీ గణేశన్‌ (1996), దర్శక – నిర్మాత కె. బాలచందర్‌ (2000)లకు కూడా ఫాల్కే అవార్డు దక్కింది. వారి తర్వాత ఆ అవార్డు సాధించిన మూడో తమిళ సినీ ప్రముఖుడయ్యారు రజనీ. నిజానికి, దక్షిణాది సినీ ప్రముఖులకు ఫాల్కే అవార్డివ్వడం ఇది 13వ సారి. ఇప్పటి దాకా ఏడుగురు తెలుగు వారికి ఫాల్కే అవార్డు దక్కింది. తెలుగువారైన బి.ఎన్‌. రెడ్డి, పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని, రామానాయుడు, కె. విశ్వనాథ్‌లు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.

ఎదుగుదలకు ఏం చేశారు?
రజనీకాంత్‌ ప్రతిభావంతుడు. దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు. దేశ, విదేశాల్లో మంచి మార్కెట్‌ ఉన్న స్టార్‌. దానధర్మాలు చేసిన సహృదయుడు. అందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే, సినీ నిర్మాణం, స్టూడియోల నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన లాంటి శాఖలలో మౌలిక వసతుల సదుపాయాల కల్పన, విస్తృతికి ఆయన చేసిందేమిటి? దేశవ్యాప్తంగా సూపర్‌ స్టార్‌గా తనను ఇంతగా ఎదిగేలా చేసిన భారత సినీ పరిశ్రమ యొక్క ఎదుగుదలలో ఆయన వంతు భాగం ఎంత, ఏమిటి? ఫాల్కే అవార్డు మార్గదర్శ కాలను ప్రస్తావిస్తూ, పలువురు నెటిజెన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవే. ఇది పూర్తిగా తమిళనాట ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార పార్టీ చేసిన ఎలక్షన్‌ స్టంట్‌ అని వారు నొసలు చిట్లిస్తున్నారు. 

తమిళనాట ఎం.జి.ఆర్‌. తరువాత మళ్ళీ ఆ స్థాయి మాస్‌ ఫాలోయింగ్‌ సంపాదించిన మనిషి రజనీకాంత్‌. జన సంస్కృతిలో కలిసిపోయిన జానపద పాత్రగా మారిన వ్యక్తి రజనీకాంత్‌. తమిళంతో పాటు తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన జనరంజకంగా నటించారు. రజనీ పంచ్‌ డైలాగులు, వాటి మీద జోకులు, ఆయనతో కార్టూన్‌ పాత్రలు, వీడియోలు రావడం ఆయన పాపులారిటీకి ప్రబల నిదర్శనం. కానీ, సినీరంగ పురోగతికి ఆయన చేసిందేమిటన్నప్పుడే అసలు ఇబ్బంది వచ్చి పడుతుంది.రజనీకాంత్‌ తన మునుపటి తరం హీరోల లాగా ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే – జనంలోనూ, సినిమాల్లోనూ వీలైనంత ఎక్కువగా కనిపించకుండా ఉంటే, తక్కువ ఎక్స్‌పోజర్‌తో ఎక్కువ కాలం నిలబడవచ్చనే ఫార్ములాను కనిపెట్టారు.

తక్కువ సినిమాలు చేయడం ద్వారా, డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌ సూత్రంలో తేడా తెచ్చి, ఒక రకమైన బాక్సాఫీస్‌ బ్లాక్‌ మార్కెట్‌ను సృష్టించారని తమిళ సినీ వ్యాపార విశ్లేషకుల మాట. ఒకప్పటి ఎన్టీఆర్, ఏయన్నార్‌. ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్‌ లాగా ఏటా అనేక సినిమాలు చేసే పద్ధతికి విరుద్ధంగా – స్టార్లు తక్కువ సినిమాలు చేసి, ఎక్కువ డబ్బు పొందవచ్చనే పద్ధతి సినీసీమలో విస్తరించడానికి కారణం ఒకరకంగా రజనీయే! తెలుగులో చిరంజీవి మొదలు క్రమంగా తరువాతి స్టార్లంతా అదే బాట పట్టారు. దానివల్ల స్టార్ల పారితోషికం, సినీ వ్యాపారం చుక్కలనంటిదేమో కానీ, ఆ మేరకు సినీరంగంలో మరిన్ని చిత్రాల నిర్మాణం, ఉపాధి, విస్తరణ మాత్రం తగ్గాయి.

అప్పట్లోనూ ఇలాగే...అవార్డుల పందేరం! వివాదం!!
రజనీకి అవార్డివ్వడంతో అనేక పాత కథలు మళ్ళీ పైకొచ్చాయి. వాస్తవానికి, కొన్ని పార్టీలు – ప్రభుత్వాలు సొంత ప్రయోజనాల కోసం పాపులర్‌ అవార్డులను వాడుకోవడం ఎప్పుడూ ఉన్నదే! ఒకప్పటి కాంగ్రెస్‌ నుంచి ఇప్పటి బి.జె.పి దాకా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఇలాంటి సంఘటనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. తమిళనాడు సంగతికే వస్తే, రాజకీయ కారణాల రీత్యానే హీరో ఎం.జి.ఆర్‌.కు ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటుడంటూ ‘భరత’ అవార్డు ఇచ్చారు. బాక్సాఫీస్‌ హిట్‌ ‘రిక్షాక్కారన్‌’ (1971)లోని రిక్షావాలా పాత్ర, నటన మాటెలా ఉన్నా అప్పట్లో తమిళనాట అధికార డి.ఎం.కె. నుంచి బయటకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న ఎం.జి.ఆర్‌.ను ఆకట్టుకొనేందుకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పంచారు. ఆ రోజుల్లో అది పెను వివాదమే రేపింది. జాతీయ పత్రికలు ‘బ్లిట్జ్‌’, ‘లింక్‌’ లాంటివి మొదలు స్థానిక తమిళ పత్రిక ‘దినతంతి’ దాకా అన్నింటా అది చర్చనీయాంశం అయింది. ఒకదశలో ఆ అవార్డును వాపసు ఇచ్చేయాలని ఎం.జి.ఆర్‌. యోచించే దాకా వెళ్ళింది.

అలాగే, ఎం.జి.ఆర్‌. చనిపోయిన వెంటనే ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించారు. అది మరో వివాదం. 1989లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజీవ్‌ గాంధీ సారథ్యంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం 1988కి ఈ అవార్డు ప్రకటన చేసింది. తమిళనాట రాజకీయ లబ్ధి కోసమే అలా ‘భారతరత్న’ ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకు ముందు 1977లో తమిళ శాసనసభ ఎన్నికలుండగా తమిళ నేత కామరాజ్‌కు కూడా 1976లో ఇలాగే మరణానంతర ‘భారతరత్న’ ప్రకటన చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. తాజాగా మళ్ళీ తమిళనాటే ఎన్నికల వేళలోనే రజనీకాంత్‌ కు ఫాల్కే దక్కడం తాజా వివాదమై కూర్చుంది.

‘తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయని రజనీకాంత్‌ కు ఫాల్కే అవార్డు ఇచ్చారా’ అని విలేఖరుల సమావేశంలో అడిగితే, అవార్డు ప్రకటించిన సాక్షాత్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రివర్యులు ‘మీరు ప్రశ్న సరిగ్గా వేయండి’ అంటూ రుసరుసలాడడం కొసమెరుపు. మొత్తం మీద ఒక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా గౌరవార్థం ఇవ్వాల్సిన అవార్డులు, స్వప్రయోజనాల కోసం అవసరార్థం వేసే బిస్కెట్లుగా మారాయని విమర్శ వస్తోంది. పలు విమర్శలకు ప్రభుత్వ పెద్దలు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవార్డు కన్నా ఎక్కువ దాన్ని ప్రకటించిన సమయం, సందర్భం ప్రశ్నార్థకమయ్యాయి. ప్రధాన వార్తలయ్యాయి. అదే విషాదం.

ఇదీ... మన తెలు‘గోడు’! 
సినీ రంగ పురోగతికి విశేష సేవలు అందించిన పలువురు తెలుగువారికి ఇప్పటికీ ‘పద్మ’ పురస్కారాల నుంచి ‘ఫాల్కే’ దాకా ఏవీ రాలేదు. అలా గుర్తింపు దక్కనివారిలో ఆనాటి ఎన్టీఆర్, యస్వీఆర్, సావిత్రి మొదలు ఇటీవలి దాసరి దాకా చాలామందే ఉన్నారు. స్టూడియో కట్టి, వివిధ భాషల్లో సినిమాలు నిర్మించి, తెలుగులో అత్యధిక చిత్రాల్లో హీరోగా నటించి, పంపిణీ, ప్రదర్శక శాఖల్లోనూ పాలు పంచుకున్న హీరో కృష్ణకు సైతం ఇప్పటికీ ఫాల్కే పురస్కారం దక్కనే లేదు. ఆ మాటకొస్తే, రాజకీయ కారణాల రీత్యా ఎం.జి.ఆర్‌.కు మరణానంతరం ‘భారతరత్న’ ఇచ్చిన ప్రభుత్వాలు మన తెలుగురత్నాలు ఎన్టీఆర్, పి.వి. నరసింహారావులను ఇప్పటికీ గుర్తించడమే లేదు. గంధర్వ గాయని ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మికి ఇచ్చిన ‘భారతరత్న’ మన వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణకు రాలేదు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలకు దక్కినంత జాతీయ గౌరవం మన గాన కోయిలలు సుశీల, జానకిలకు లభించలేదు. ఏ అవార్డులు ప్రకటించినా దాదాపు ప్రతిసారీ తెలుగు వారి విషయంలో ఇదే తంతు. ఉత్తరాది, దక్షిణాది వివక్ష కూడా దీనికి ఒక కారణమని విమర్శ. 

– రెంటాల జయదేవ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement