మరో నిర్భయను అవుతానేమో అనిపించింది!
- తొలిరోజే ఆఫీసులో ఫాషన్ డిజైనర్‌పై బాస్ దుశ్చర్య
డిగ్రీ పూర్తవ్వగానే కోటి ఆశలతో ఆమె ఫ్యాషన్ రంగంలో తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే ప్రముఖ కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్‌గా ఉద్యోగం దొరికింది. కానీ, ఆఫీసులో అడుగుపెట్టిన తొలిరోజే ఆమెకు భయానకమైన అనుభవం ఎదురైంది. ఏకంగా బాసే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ యువతికి ఈ చేదు ఘటన ఎదురైంది. గురుగ్రామ్‌కు చెందిన రిటైల్ కంపెనీ ఆమెను నియామకం చేసుకుంది. ఆమె సోమవారం ఆఫీసులో అడుగుపెట్టింది. 'సరిగ్గా 11 గంటలకు నేను ఎంజీ రోడ్డులోని ఆఫీసుకు వెళ్లాను. కంపెనీ ఎండీ మొదట నాతో ముచ్చటించి.. కాసేపు వేచి ఉండమని చెప్పాడు. మూడు గంటల తర్వాత అతడు వచ్చి కాపషెరా సరిహద్దుల్లో ఉన్న కంపెనీ యూనిట్‌ను సందర్శించడానికి నాతో పాటు వస్తావా అని అడిగాడు. నేను మొదట కొంచెం సంకోచించాను. కానీ సహోద్యోగులు ప్రోత్సహించారు. ఇద్దరం కలిసి కారులో వెళ్లాం. కారులో ఎక్కినప్పటి నుంచి అతడు నన్ను అసభ్యమైన ప్రశ్నలు అడిగాడు. మద్యం తాగుతావా? ఎలాంటి దుస్తులు వేసుకుంటావు అంటూ ప్రశ్నించాడు. అక్కడి వెళ్లాక ఇతర ఉద్యోగినులకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా అని ఆరా తీశాను. ఈ కంపెనీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించాను. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎండీ మరింతగా రెచ్చిపోయి ప్రవర్తించాడు. మద్యం తాగుతూ.. పార్టీలకు హాజరైతే.. నువ్వు ఎక్కడికీ వెళ్లిపోతావని, ఎంతగానో ఎదుగుతావని చెప్పుకొచ్చాడు. ఒకచోట కారు దిగి బీరు కొనుక్కొని.. కారులో నాతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. అనుచితంగా నన్ను తాకాడు.
నేను మరో నిర్భయను అవుతానేమోనని భయం చేసింది. సమీపంలోని మెట్రో వద్ద నన్ను దింపేయండని వేడుకున్నాను. మొదట నేను ఎంత వేడుకున్నా వినకుండా వేధించిన అతను.. నేను తీవ్రంగా ప్రతిఘటించడంతో సికందర్‌పూర్ మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం 6 గంటల సమయంలో నన్ను దింపేశాడు' అని బాధితురాలు ఓ టీవీ చానెల్‌తో తెలిపింది. ఆమె సదరు కంపెనీ ఎండీపై డీఎల్‌ఎఫ్ ఫేజ్-2 పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతనిపై ఐపీసీ సెక్షన్ 354 (ఏ) (లైంగికంగా వేధించి శారీరక లైంగిక చర్యలకు పాల్పడటం) ప్రకారం అభియోగాలు నమోదుచేశారు. అయితే, కోర్టు బయట ఈ వ్యవహారాన్ని తేల్చుకునేందుకు తనపై నిందితుడు ఒత్తిడి తెస్తున్నట్టు బాధితురాలు తాజాగా మీడియాకు తెలిపింది.