పాక్ బాలిక కల నెరవేర్చిన ఢిల్లీ సీఎం, సుష్మా
న్యూఢిల్లీ: ఢిల్లీలో చదవాలన్న ఓ పాకిస్థాన్ నుంచి వచ్చిన బాలిక కల నెరవేరింది. రెండేళ్లుగా ఏ స్కూల్లో అవకాశం ఇవ్వకపోయినా ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో చివరకు ఆ అమ్మాయికి ఢిల్లీ స్కూల్లో చదివే అవకాశం వచ్చింది. పాకిస్థాన్కు చెందిన మధు అనే పదహారేళ్ల అమ్మాయి రెండేళ్ల కిందట ఢిల్లీకి వచ్చింది. తన తల్లి, సోదరులు, బాబాయ్తో కలిసి ఇక్కడ అడుగు పెట్టింది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జరుగుతున్న మతపరమైన హింసను భరించలేక వారి కుటుంబం ఇండియాకు తరలి వచ్చింది. అయితే, స్కూలుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పోగొట్టుకుంది.
దీంతో ఆమెకు ఎక్కడా అడ్మిషన్ ఇవ్వలేదు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోపాటు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ను ఆ అమ్మాయి కలిసింది. దీంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఆ అమ్మాయిని చేర్చుకోవాల్సిందిగా లేఖ రాశారు. దీంతో ఆ అమ్మాయికి ప్రవేశం లభించింది. దీంతో సిసోడియాకు ధన్యవాదాలు తెలుపుతూ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. మానవతా దృక్పథంతోనే ఆమెకు సీటు ఇచ్చినట్లు సిసోడియా చెప్పారు.