న్యూఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో ....'ప్రభుత్వ విధానాల కారణంగా భారతదేశంపై అనేక ఆశలు నెలకొన్నాయి. భారతదేశం దూసుకెళ్తోందని ఐఎంఎఫ్ కూడా చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవృద్ధి తగ్గినా, మనం మాత్రం ముందుకెళ్తున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా తీరాన్ని చేరడం మాకు తెలుసు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా తీరాన్ని చేరడం మాకు తెలుసు. జీడీపీ వృద్ధిరేటు 7.6 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం 5.4 శాతానికి తగ్గింది. లోటు 18.4 బిలియన్ డాలర్ల నుంచి 14.4 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఫారిన్ కరెన్సీ రిజర్వులు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. వాతావరణ పరిస్థితులకు తోడు రాజకీయ పరిస్థితులు కూడా బాగోకపోయినా వృద్ధి సాధిస్తున్నాం. అంతర్జాతీయ మందగమనం వల్ల మనకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా మూడు రకాల సమస్యలు వస్తున్నాయి. విదేశీ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో భారతీయ మార్కెట్ల మీదే ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఆ సవాళ్లను కూడా అవకాశాలుగా మార్చుకుంటున్నాం.
14వ ఆర్థిక కమిషన్ రాష్ట్రాల వాటాను 55 శాతం నుంచి 65 శాతానికి పెంచింది. ఓఆర్‌ఓపీ, కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వంపై భారం పెరిగింది. దాంతో కొన్ని ఖర్చులను ప్రైవేటీకరించాలని నిర్ణయించాం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతో రైతులు నామమాత్ర ప్రీమియం చెల్లించి భారీ పరిహారం పొందుతారు. నిరుపేదల కోసం ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెడుతున్నాం' అని పేర్కొన్నారు.
ఇక మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ ఈసారి అయినా తమను కరుణిస్తారని, ఆదాయం పన్ను మినహాయింపులను పెంచుతారని, శ్లాబుల్లో కూడా సవరణలు తీసుకొచ్చి రాయితీలను పెంచుతారని ఉద్యోగస్థులు ఆశిస్తున్నారు.