union budget 2016
-
అరుణ్ జైట్లీకి లెక్కలు రావా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం వార్షిక జనరల్ బడ్జెట్ సమర్పిస్తూ మరోసారి అబద్ధం ఆడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంఎన్ఆర్ఈజీ) పథకానికి మున్నెన్నడు లేనివిధంగా 38,500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు గర్వంగా చెప్పుకున్నారు. 2006లో ప్రారంభించిన ఈ పథకానికి 2010-11 వార్షిక బడ్జెట్లో ఏకంగా 40,100 కోట్ల రూపాయలను కేటాయించారు. గతేడాది కూడా ఈ పథకానికి 34,699 కోట్ల రూపాయలను కేటాయించినప్పుడు కూడా మున్నెన్నడు లేని విధంగా అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఏడాది 34,000 కోట్ల రూపాయలను కేటాయించారు. దానితో పోలిస్తే గతేడాది 699 కోట్ల రూపాయలను అరుణ్ జైట్లీ అదనంగా కేటాయించగా, ఈ ఏడాది 38, 500 కోట్ల రూపాయలను కేటాయించారు. ఒకవేళ కేటాయింపులు ముఖ్యం కాదు, ఖర్చు పెట్టిందే లెక్కనుకుంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో 38, 552 కోట్ల రూపాయలు యూపీఏ ప్రభుత్వం ఈ పథకంపై ఖర్చు పెట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కన అరుణ్ జైట్లీ మాట నిజం కావాలంటే మున్నెన్నడు లేనివిధంగా కేటాయింపులు జరిపామనకుండా, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి అత్యధిక కేటాయింపులు జరపడం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు సజీవ స్మృతి చిహ్నంగా ఈ పథకాన్ని కొనసాగిస్తామంటూ గత ఫిబ్రవరి నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం ఈ పథకంలో వారి డ్రామాను సూచిస్తోంది. మరింత లోతుగా పరిశీలిస్తే ఎనిమిది కరవు రాష్ట్రాలతోపాటు మిగతా 21 రాష్ట్రాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈబిల్లుల మొత్తం 6,359 కోట్ల రూపాయలు. కరవు రాష్ట్రాలకు యాభై వేల పని దినాలను అదనంగా ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికీ వాటికి నిధులు విడుదల చేయలేదు. వాటిని కూడా కలుపుకుంటే ఉపాధి హామీ పథకానికి 47, 549 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. పెరిగిన ద్రవ్యోల్బణం రేటును, పెరిగిన గ్రామీణ కుటుంబాలను లెక్కలోని తీసుకుంటే ఈ పథకం అమలుకు అక్షరాల 50,000 కోట్ల రూపాయలు అవసరం. అనుభవజ్ఞుడైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఈ మాత్రం లెక్కలు రావా? ఉద్దేశపూర్వకంగా చేసిన అబద్ధపు ప్రచారమా? -
ఈపీఎఫ్ పన్నుపై పునరాలోచన?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే అవకాశం కన్పిస్తోంది. దీనిపై ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనబడుతోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పేర్కొన్నారు. పదవీ విరమణ నాటికి ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిలో 40 శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. తాజా ప్రతిపాదనపై ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ పీఎస్ పన్నుల విధానంలో ప్రతిపాదిత మార్పుల పట్ల ఆందోళనను గుర్తించామని, దీనిపై సందేహాలను త్వరలోనే నివృత్తి చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. 60 శాతం మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను చెల్లించాల్సివుంటుందని పీటీఐతో రెవెన్యూ కార్యదర్శి హసముఖ్ అదియా చెప్పారు. ప్రిన్సిపల్ అమౌంట్ కు పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. -
'బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌ను అవమానించేలా ఉంది'
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అవమానం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'చంద్రబాబు నిస్సహాయ స్థితి, చేతగానితనానికి అద్దం పట్టింది. రాష్ట్రానికి రావాల్సింది చంద్రబాబు కన్నీళ్లు కాదు, అభివృద్ధి. కేంద్రం, రాష్ట్రం కలిసి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. 5 కోట్ల ఏపీ ప్రజలను బికారులుగా చేశారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తానన్న మంత్రి దేవినేని ఉమ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు. ఇప్పటికైనా చంద్రబాబు నోరు విప్పాలి. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం చంద్రబాబు పోరాడాలి.' అని పార్థసారధి సూచించారు. -
అవినీతి, కేసులు.. బాబు నోరు నొక్కేశాయి!
బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై నోరెత్తని ముఖ్యమంత్రి ఓటుకు కోట్లు కేసు, అవినీతి వల్లే కేంద్రంపై ఒత్తిడి చేయని చంద్రబాబు రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించని కేంద్రం ప్రత్యేక హోదా ఊసు లేదు..రైల్వే జోన్ విషయంలోనూ మొండిచెయ్యి పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లే 2018 నాటికి పూర్తి చేస్తామన్న సీఎం మాటలన్నీ అసత్యాలే! సాక్షి, హైదరాబాద్: నిన్న రైల్వే బడ్జెట్లో మొండి చెయ్యి... నేడు సాధారణ బడ్జెట్లోనూ అరకొర విదిలింపులు... అయినా రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోరెత్తడం లేదు. కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌పెట్టి ‘మా అవసరాలకు తగినన్ని నిధులెందుకు ఇవ్వరు’ అని అడిగిన పాపాన పోలేదు. ఒకవైపు అవినీతి, మరోవైపు ఓటుకు కోట్లు కేసు వెంటాడుతుండడం వల్లే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేయలేకపోతున్నారని విశ్లేషకులంటున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది రాష్ర్టప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శకులంటున్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం, జాతీయహోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు అరకొర నిధులు విదిలించడం ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎప్పుడూ కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. హోదా కన్నా కేంద్రం మెరుగైన ప్యాకేజీ ఇస్తుందని చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో అరకొరగానే నిధులు విదిలించినా ఎందుకు మాట్లాడడం లేదని పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. రెండేళ్లు పూర్తవుతున్నా విభజన చట్టంలోని హామీల విషయంలోనూ కేంద్రాన్ని ఒత్తిడి చేయడానికి చంద్రబాబు సిద్ధపడడం లేదు. స్వార్థప్రయోజనాలే కారణమా..? అయితే రాజధానిని, పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వివాదాస్పదంగా మార్చడం వల్లే కేంద్రం మొండిచేయి చూపినట్లు అధికార వర్గాలంటున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన నిధులను పట్టిసీమ ప్రాజెక్టు కోసం వినియోగించారు. పోలవరం ప్రాజెక్టు కిందే పట్టిసీమ ప్రాజెక్టును చూపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే, చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. పోలవరం ప్రాజెక్టును అథారిటీ కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించారు. తన పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి, కమీషన్లు దండుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారు. అందుకే ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.200 కోట్లు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.300 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఇందుకు గతంలో ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని, వినియోగ పత్రాలు అందజేయాలని రాష్ట్రాన్ని కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు కింద చేసిన వ్యయాన్ని పోలవరం కింద చూపించి నిధులు ఇవ్వాల్సిందిగా కోరింది. దీనికి కేంద్రం ససేమిరా అంది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని, అందుకు నిధు లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌లో ప్రకటించిన రూ.300 కోట్లను విడుదల చేయాలంటే వినియోగ పత్రాలు సమర్పించాలని తేల్చిచెప్పింది. ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. రూ. 40 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టుకు ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున అరకొర నిధులే కేటాయిస్తున్నా 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని బాబు చెబుతున్నారు. రాజధాని నిధులు పక్కదారి రాజధాని నిర్మాణానికి కేంద్రం గతంలో ఇచ్చిన రూ.850 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు మళ్లించింది. ఇటీవల ఈ విషయం నీతి ఆయోగ్ దృష్టికి వెళ్లింది. ఇప్పటివరకు రాజధానిలో భవనాల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని నీతి ఆయోగ్ కోరింది. ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనిపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రూ.4,000 కోట్లు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని కోరారు. అయితే రాజధాని నిధులను ఇప్పటికే పక్కదారి మళ్లించిన నేపథ్యంలో కేంద్రం బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. -
'ఈసారి ఆ విషయం ఎందుకు చెప్పలేదో'
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి దేశ రక్షణ బడ్జెట్ ఎంతో చెప్పలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత అసలు డిఫెన్స్ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారనే విషయాన్ని ఆయన చదవలేదు. ఏడవ సెంట్రల్ కమిషన్ సూచించిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) చెల్లింపులు ఈసారి బడ్జెట్‌కు అదనపు భారం అంటూ చెప్పిన ఆయన డిఫెన్స్ బడ్జెట్ ఎంత అనే విషయం మాత్రం సభలో ప్రస్తావించలేదు. అయితే, మొత్తం బడ్జెట్లో దాదాపు పది శాతంగానీ, అంతకంటే ఎక్కువగానీ డిఫెన్స్‌కు కేటాయించడం పరిపాటి. గత ఏడాది డిఫెన్స్ రంగానికి రూ.2,46,727కోట్లు కేటాయించారు. -
'ఆ కల నెరవేరడం ఇంపాజిబుల్'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదొక కలగూర గంప బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ వెనుక పెద్ద ఆలోచనేది చేయనట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయాలు రెండింతలు అవుతాయని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా చెప్పిందని.. అది ముమ్మాటికీ సాధ్యం కాని ఐడియా మాత్రమే అన్నారు. 'ఇది మిశ్రమ అంశాలతో నింపిన సంచిలాంటి బడ్జెట్. ప్రధాని నిన్న ప్రకటించిన ఒక ఐడియా తప్ప దీని వెనుక పెద్ద ఆలోచనేది చేయనట్లు కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం డబుల్ అవుతుందని చెప్పారు. అది తీరే కలమాత్రం కాదు. పోని ఎలా సాధిస్తారో కూడా వివరించలేదు' అని మన్మోహన్ సింగ్ బడ్జెట్‌పై స్పందించారు. -
ఏపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే అన్యాయం
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రత్యేక హోదా వంటి హామీలను ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, ఇప్పుడు సాధారణ బడ్జెట్లోనూ రాష్ట్రానికి అదే పరిస్థితి ఎదురైందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. -
ఈసారి ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?
న్యూఢిల్లీ: సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనగానే కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారంతా తమకు ఇష్టమైనవి ఈసారి ఏ విధంగా లభిస్తాయి? తాము ఊహించిన దానికంటే తక్కువ ధరకే లభిస్తాయా లేక జేబుకు చిల్లు పెట్టి అందకుండా పోతాయా అని చూస్తుంటారు. అయితే, సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం అలా ఎదురు చూసిన వారికి కొందరికి నిరాశ కొందరికి ఊరట కలిగించారు. ఎప్పటిలాగే పొగరాయుళ్లను వదిలిపెట్టని జైట్లీ అదే సమయంలో బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసేవారిచే మరోసారి అబ్బో అనిపించారు. రెస్టారెంట్లకు వెళ్లేవారు కూడా ఈసారి కాస్త ఆలోచించుకోవాల్సిందే. కానీ, ఈసారి పాదరక్షలు రోటర్స్, బ్రాడ్ బాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్స్‌లు, డిజిటల్ వీడియో, సీసీటీవీ కెమెరాలు వంటివి తగ్గించి సామాన్యుడికి కాస్తంత ఊరట కల్పించారు. అసలు ఆయన బడ్జెట్‌తో ఈ ఏడాది ఏ వస్తువుల కొండెక్కి కూర్చుంటాయో.. ఏవి అందుబాటులో ఉంటాయో ఓసారి పరిశీలిస్తే.. పెరిగేవి.... కార్లు సిగరెట్లు, పొగాకు, కాగితం బీడీలు, గుట్కా రెస్టారెంట్లలో భోజనాలు, విమాన ప్రయాణం రూ.వెయ్యి పైబడిన రెడీమేడ్ గార్మెంట్స్, బ్రాండెడ్ వస్తువులు వెండి మినహా బంగారం, ఇతర అభరణాలు దిగుమతి చేసుకునే ఆభరణాలు మినరల్ వాటర్ రూ.2లక్షల పై బడిన వస్తు రవాణా అల్యూమినీయం ప్లాస్టిక్ బ్యాగులు, సాక్స్‌లు రోప్ వే, కేబుల్ కారు ప్రయాణాలు పరిశ్రమల్లో వాడే సోలార్ వాటర్ హీటర్స్ లీగల్ సర్వీసులు లాటరీ టిక్కెట్లు ప్రైవేటు అద్దె వాహనాల్లో ప్రయాణం ఈ-రీడింగ్ డివైస్‌లు వాయిస్ ఓవర ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ) విదేశీ గోల్ఫ్ కార్ట్లు బంగారు కడ్డీలు తగ్గేవి.... పాద రక్షలు సోలార్ పంపులు రోటర్స్, బ్రాడ్ బాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్స్‌లు, డిజిటల్ వీడియో, సీసీటీవీ కెమెరాలు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ డయాలసిస్ పరికరాలు 60 చదరపు మీటర్లలో నిర్మించే ఇళ్లు జానపద కళాకారులకు చెల్లించే మొత్తాలు రిఫ్రిజిరేటర్ కంటెయినర్స్ పెన్షన్ ప్లాన్స్ మైక్రో వేవ్ ఓవెన్స్ సానిటరీ ప్యాడ్స్ బ్రెయిలీ పేపర్ -
తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో కేటాయింపులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో తెలుగు రాష్ట్రల్లోని విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. వివరాలిలా ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్)- కోటి రూపాయలు ట్రైబల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)- రూ. 2 కోట్ల చొప్పున కేటాయింపు ఐఐటీ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ఐఐటీ (హైదరాబాద్)- రూ.20 కోట్లు ఐఐఎమ్ (విశాఖపట్నం-ఆంధ్రప్రదేశ్)- రూ. 30 కోట్లు నిట్ (తాడేపల్లిగూడెం-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ఐఐఎస్ఈఆర్ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ట్రిపుల్ ఐటీ (ఆంధ్రప్రదేశ్)- రూ. 20 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి - రూ.100 కోట్లు విశాఖ మెట్రోకు రూ.10 లక్షలు విజయవాడ మెట్రోకు రూ.6 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెలకొల్పే పారిశ్రామిక యూనిట్లకు వడ్డీ రాయితీ వర్తింపు -
ఇది పూర్తిగా గ్రామీణ బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్లో తనదైన వైఖరికి విరుద్ధంగా గ్రామీణ రంగానికి, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. మధ్య తరగతిని, కార్పొరేట్ రంగాన్ని విస్మరించారు. ఉద్యోగులను, పన్ను చెల్లింపుదారులను పెద్దగా కరుణించలేదు. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులను కాస్త కరుణించారు. ఇంటి అద్దెలో ఏడాది పన్ను మినహాయింపును 24 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయలకు పెంచారు. ఏడాదికి ఐదు లక్షల రూపాయలలోపు ఆదాయం కలిగి తక్కువ పన్ను చెల్లించే వారికి ఏడాది పన్నులో రెండు వేల రూపాయలు ఇస్తున్న మినహాయింపును ఐదు వేల రూపాయలకు పెంచారు. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ రంగానికి, పేదల ప్రయోజనాలకు పెద్ద పీట వేశారన్నది విశ్లేషకుల వాదన. బడ్జెట్లో మొత్తం వ్యయం కేటాయింపులను 19.78 లక్షల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అందులో ప్రణాళిక వ్యయం కింద 5.50 లక్షల కోట్ల రూపాయలను సూచించగా, ప్రణాళికేతర వ్యయం కింద 14.28 లక్షల కోట్ల రూపాయలు పేర్కొన్నారు. మొత్తంగా గ్రామీణ రంగానికి 87, 765 కోట్ల రూపాయలను కేటాయించగా, అందులో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మున్నెన్నడు లే ని విధంగా ఏకంగా 38,500 కోట్ల రూపాయలను కేటాయించారు. కేంద్ర ఆర్థిక సర్వే సూచించినట్లుగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ 35,984 కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయ రుణాల టార్గెట్‌ను 9లక్షల కోట్ల రూపాయలుగా నిర్దేశించారు. రుణాల మాఫీకి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ ఏడాది దేశంలో 5లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృష్ వికాస్ యోజన పథనాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. 2022 నాటికి వ్యవసాయదారుడి ఆదాయం రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ కింద ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించారు. మౌలిక సౌకర్యాల మెరగుపర్చడంలో భాగంగా గ్రామీణ, రాష్ట్ర, జాతీయ రోడ్ల అభివృద్ధికి 97 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైలు, రోడ్డు పనుల మొత్తానికి 2.18 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇంకా దేశంలో కరంట్ సౌకర్యానికి నోచుకోని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయని అరుణ్ జైట్లీ చెబుతూ 2018 నాటికి నూటికి నూరు శాతం గ్రామాలను విద్యుదీకరిస్తామని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలకు సబ్సీడీపై వంటగ్యాస్‌ను సరఫరా చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించారు. 60 ఏళ్లు వయస్సు దాటిని వారికి 30 వేల రూపాయల అదనపు బీమా సౌకర్యాన్ని కల్సిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోస 5,500 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు దేశంలో 1700 కోట్ల రూపాయలతో 1500 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి మూడేళ్లపాటు వారి పింఛను పథకానికి 8.33 శాతం చొప్పున ప్రభుత్వం తనవంతు వాటాగా చెల్లించనున్నట్టు బడ్జెట్లో ప్రతిపాదించారు. అరుణ్ జైట్లీ సంపన్నులను కరణించకపోగా సర్‌చార్జీల పేరిట వారిపై పన్ను భారాన్ని మోపారు. డీజిల్, ప్రెటోలు కార్లపై, ఖరీదైన వస్తువులపై పన్నులు పెంచారు. పొగాకు ఉత్పత్తులపై పన్ను భారాన్ని పెంచారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలను వాణిజ్యంలో ప్రోత్సహించేందుకు 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. అధిక పన్నులతో సిమెంట్ ధరలు పెరగడం వల్ల మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. ఎరువుల ధరలు పెరగడం వల్ల ఎక్కువ భారం వ్యాపారస్థులపైనే పడుతుంది. కార్పొరేట్ రంగాన్ని కరుణించకపోవడంతో ఈ రోజు సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు పడిపోయింది. దేశంలో విమానాశ్రయాల అభివృద్ధికి ఒక్కోదానికి 100-150 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో నడుస్తున్నప్పుడు భారత్ వ్యవస్థ బలంగానే కొనసాగుతోందని, దీన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రస్తుత ఆర్థిక లోటును జాతీయ స్థూల ఉత్పత్తిలో 3.9 శాతాన్ని 3.5 శాతానికి ఏడాదిలో తగ్గిస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. -
2016-17లో సవాళ్లేంటంటే..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన అనంతరం సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఎదురయ్యే సవాళ్లు తెలిపారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పురోగతి మందగమన పరిస్థితిలో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు దేశీయ ఉత్పత్తులపై దృష్టిని సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను స్టార్ట్ప్ కార్యక్రమానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ 2016 - 2019 మధ్య కాలంలో కొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి వంద శాతం మూడేళ్లపాటు పన్నుపోటు ఉండదని చెప్పారు. దీని ప్రకారం దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఎక్కువని ఆయన సంకేతాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం ఏడో వేతన సంఘం చేసిన సూచనలు, ఓఆర్ఓపీ పథకాలకు చేయాల్సిన చెల్లింపులు బడ్జెట్ మీద అధికభారం కానుందన్నారు. -
2016-17 కేంద్ర బడ్జెట్ హైలైట్స్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ.. మొత్తం బడ్జెట్ ఇదే.. *2016-17 బడ్జెట్ రూ. 19.78లక్షల కోట్లు *ప్రణాళికా వ్యయం రూ.5.5లక్షల కోట్లు *ప్రణాళికేతర వ్యయం రూ. 14.28లక్షల కోట్లు వృద్ధి తీరు ఇలా... * ఈ ఏడాది 7.6 శాతం వృద్ధి * రుతుపవనాలు అనుకూలించకపోయినా 7.6 శాతం వృద్ధిరేటు * అయినా పటిష్టంగా భారత్ ఆర్థిక వృద్ధి * ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, సవాళ్లు * తొమ్మిది పునాదులపై బడ్జెట్ ప్రతిపాదనలు * ఆరు సెక్టార్లలో సంస్కరణలు కొనసాగింపు * 9శాతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని5.4 శాతానికి తగ్గించాం * ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం లోటు ఎంతంటే... *ద్రవ్య లోటు 3.5 శాతానికి పరిమితం *15.3 శాతం పెరిగిన ప్రణాళికా వ్యయం మార్పు లేదు ఆదాయపన్ను శ్లాబులు, రేట్లు యథాతథం కొత్త పన్నుల కారణంగా రూ.19.610 కోట్ల ఆదాయం *కోటిమంది పన్ను చెల్లింపుదారులకు ఊరట *5 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారికి రిబేట్ పెంపు * ప్రతి ఏటా 30వేల వరకూ పన్ను మినహాయింపు * ఇంటి అద్దెపై పన్నుమినహాయింపు రూ.24 వేల నుంచి రూ.60వేలకు పెంపు * రిబేట్ రూ.2వేలు నుంచి రూ.5వేలకు పెంపు * రిబేట్ల ద్వారా ట్యాక్స్ చెల్లింపుదారులకు ఊరట * పన్ను చెల్లింపుదారులను గుర్తిస్తున్నాం * ఈ ఏడాది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బాండ్లు ముక్కుపిండి వసూలు ట్యాక్స్ ట్రిబ్యునల్‌కు 11 కొత్త బెంచ్‌ల ఏర్పాటు పన్నుల ఎగవేతపై విచారణ వేగం పన్ను ఎగవేతలను సీరియస్‌గా పరిగణిస్తాం పన్ను ఎగవేశామని ముందుకు వస్తే పన్నులో 50శాతం పెనాల్టీతో సరి లేకుంటే పన్నుకు అదనంగా 200శాతం వసూలు బ్రెయిలీ పేపర్‌పై పూర్తిగా పన్ను మినహాయింపు కార్లతో కాస్త కంగారు * లగ్జరీ కార్లు మరింత ప్రియం రూ.10 లక్షల పైబడ్డ కార్లపై ఒక శాతం సర్వీస్ ట్యాక్స్ విధింపు రూ.2లక్షల వరకూ కార్ల పరికారాలు కొంటే సర్వీస్ ట్యాక్స్ ఒక శాతం అదనం కార్లు, ఎస్వీయులు, డీజిల్ వాహనాలకు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు *2015లో అత్యధికంగా మోటారు వాహనాల ఉత్పత్తి సర్ చార్జీ పెంచేశారు ఏడాదికి కోటి రూపాయల ఆదాయం ఉండేవారికి సర్ ఛార్జి పెంపు సర్ ఛార్జి 12 శాతం నుంచి 15 శాతానికి పెంపు ఈపీఎఫ్ కింద పెట్టుబడి రూ.1.5లక్షలకు పరిమితం 60 చదరపు అడుగల ఇంటి నిర్మాణంపై సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు వెండికి ఓకే.. బ్రాండెడ్‌తో బాదుడు *వెండి తప్ప, ఇతర నగల మీద 1 శాతం అదనపు ఎక్సైజ్ డ్యూటీ *బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాల మీద అదనపు పన్ను *కోల్, లిగ్నైట్ మీద అదనపు పన్ను ఖరీదైన పొగ *బీడీలు తప్ప పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను 15 శాతానికి పెంపు కాస్త ఊరట *నిర్మయ పథకాలకు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు *రిటైర్మెంట్ సమయంలో విత్ డ్రాల్స్ పన్ను నుంచి మినహాయింపు * జాతీయ పెన్షన్ పథకం నుంచి విత్ డ్రాలపై ఊరట *మూడేళ్లలో ప్రతి పోస్టాఫీసులో మినీ ఏటీఎం, మైక్రో ఏటీఎంలు *స్టార్టప్ కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు కంపెనీల చట్టంలో మార్పులు *విత్తనాల నిల్వకు రూ.900 కోట్లు అన్నిటికీ ఆధారే.. * ఆధార్ ఆధారంగానే సబ్సిడీలు, రుణాలు *100 కోట్లమందికి ఆధార్ ద్వారా ఆర్థిక సేవలు *ఈ ఏడాది ముద్ర బ్యాంకు కింద రూ.2.5 కోట్లమందికి రుణాలు *ప్రభుత్వ రంగ బ్యాంకులకు అండ *బ్యాంకులు, బీమా సంస్థలు దివాళా తీయకుండా కొత్త చట్టం * బ్యాంకుల పునరుద్ధరణకు రూ.25 కోట్లు *ఐడీబీఐలో 50శాతం తగ్గించుకోనున్న కేంద్రం కొత్త ఉద్యోగాలకు ఊతం *రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు *కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ పెన్షన్ పథకానికి 8.33 శాతం ప్రభుత్వ కంట్రిబ్యూషన్ *చిన్న దుకాణాలు వారంలో ఏడు రోజులూ తెరిచేందుకు అనుమతి చదువుకులకు అరకొరే.... * ఉన్నత విద్య చదివేవారికి చేయూత * వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని *వచ్చే మూడేళ్లలో కోటిమందికి నైపుణ్యంలో శిక్షణ * వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు * స్కూళ్లల్లో మార్కుల షీట్లు, టీసీలన్నింటికి డిజిటల్ టెక్నాలజీ *డిజిటల్ అక్షరాస్యత కోసం రెండు కార్యక్రమాలు *రాబోయే మూడేళ్లలో 6 కోట్ల ఇళ్లకు డిజిటల్ అక్షరాస్యత ఆరోగ్యం పర్వాలేదు *డయాలసిస్ పరికరాల మీద బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు మినహాయింపు *అన్ని జిల్లా ఆస్పత్రుల్లో పీపీపీ మోడ్‌లో జాతీయ డయాలసిస్ సర్వీస్ *జెనెరిక్ మందులను అందించేందుకు అదనంగా 3వేల దుకాణాలు *ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా 30 వేలు *లక్ష కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం *పశు సంపదకు రూ.850 కోట్లు విమానాలు.. నౌకలు * వినియోగంలో లేని ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ.150 కోట్లు * దేశంలో 160 ఎయిర్ పోర్టుల అభివృద్ధి * ఒక్కో ఎయిర్ పోర్టుకు రూ.50 నుంచి రూ.100 కోట్లు * తీర ప్రాంతాల్లో 2 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు * గ్రీన్ ఫీల్డ్ పోర్టుల కోసం రూ. 800 కోట్లు ఖర్చు * డీప్ సీ నుంచి గ్యాస్ తీస్తే ప్రోత్సహాలు * విద్యుత్ ఉత్పత్తి పెంపుదల కోసం రూ.3వేల కోట్లు * అణు విద్యుత్ కోసం రూ.3వేల కోట్లు * సాగర్ మాల ప్రాజెక్ట్ కోసం రూ.80వేల కోట్లు రవాణా-రహదారులు *రహదారుల రంగంపై మొత్తం రూ.97వేల కోట్లు ఖర్చు *రూ.15వేల కోట్లతో బాండ్లు జారీ * హైవేల నిర్మాణం కోసం బాండ్లు *హైవేల కోసం రూ.55వేల కోట్లు ఎస్సీ మహిళకు పెద్దపీట *ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సహకాలు * ఎస్సీ, ఎస్టీ మహిళలకు స్టాండ్ అప్ ఇండియా పథకం కింద రూ.500 కోట్లు *అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం జరుపుకొంటున్నాం. *ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. గ్రామ స్వరాజ్యం దిశగా... *గ్రామీణాభివృద్ధికి మొత్తం రూ.87,765 కోట్లు * ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు *300 గ్రామాలను పట్టణాలుగా మార్చే ప్రక్రియ *క్లస్టర్ల కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ *గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా రూ.2.87 లక్షల కోట్లు *కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలతో కలిసి వీటి అభివృద్ధికి కృషి *18542 గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు *వెయ్యి రోజుల్లో వీటికి సదుపాయం కల్పిస్తామని ఇంతకుముందు చెప్పాం *ఇప్పటివరకు 5542 గ్రామాలకు విద్యుత్ సదుపాయం *దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజనకు 8500 కోట్లు *స్వచ్ఛభారత్ మిషన్‌కు 9వేల కోట్లు *16.8 కోట్ల గ్రామీణ ఇళ్లలో 12 కోట్ల ఇళ్లకు కంప్యూటర్లు లేవు *పంచాయతీరాజ్ సంస్థల కోసం రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్‌కు రూ. 655 కోట్లు *పేదలలో చాలామందికి ఇప్పటికీ వంటగ్యాస్ సదుపాయం లేదు. *ఇంట్లో మామూలు పొయ్యి ఉంటే.. గంటకు 400 సిగరెట్లు కాల్చిన దాంతో సమానం *పేదలకు గ్యాస్ సదుపాయం కల్పించేందుకు రూ. 2000 కోట్లు *1.50 కోట్ల కుటుంబాలకు దీంతో లబ్ధి, మరో రెండేళ్లు కూడా కొనసాగింపు * బీపీఎల్ కుటుంబాలకు వంటగ్యాస్ కు కసరత్తు *పప్పు ధాన్యాల ఉత్పత్తికి రూ.500 కోట్లు * వృద్ధులకు ఆరోగ్య బీమా పథకం *ఈపీఎఫ్ కింద కొత్త ఉద్యోగుల కోసం రూ.వేయి కోట్లు కేటాయింపు రైతన్నకు ఏమిచ్చారంటే.. * సాగునీటి ప్రాజెక్టులకు రూ.86,500 కోట్లు * 28.5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొస్తాం *గత ఏడాదితో పోలిస్తే రూ.50వేల కోట్లు వ్యవసాయ రుణాల పెంపు * సాగునీటి రంగానికి రూ.20వేల కోట్లు * అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఈ-మార్కెట్ల సదుపాయం * ఈ ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.9లక్షల కోట్లు * ప్రధాని రహదారుల పథకానిఇ రూ.19వేల కోట్లు * వ్యవసాయేతర రంగాల్లో ఆదాయల పెంపుకు కృషి వ్యవసాయ, మౌలిక వసతుల రంగంపై అదనపు సెస్సు *విత్తనాల నిల్వకు రూ.900 కోట్లు * రుణాల మాఫీకి రూ.15వేల కోట్లు * రానున్న మూడేళ్లలో ఐదు లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ పంటలు *వ్యవసాయానికి రూ.35, 984 కోట్లు * ఆథార్ కార్డు కింద అందరికీ పథకాలు *గ్రామీణ ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ * నామమాత్రపు ప్రీమియంతో ప్రధాని పంటల బీమా *దేశ ఆహార భద్రతకు వెన్నెముకలు రైతులే *వెనుకబడ్డ వర్గాల కుటుంబాలకు మూడు పథకాలు ప్రవేశం * 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం * సంక్షేమం, గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఖర్చు పెంపు * నీటి లభ్యత పెంచే విధంగా చర్యలు -
ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో ....'ప్రభుత్వ విధానాల కారణంగా భారతదేశంపై అనేక ఆశలు నెలకొన్నాయి. భారతదేశం దూసుకెళ్తోందని ఐఎంఎఫ్ కూడా చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవృద్ధి తగ్గినా, మనం మాత్రం ముందుకెళ్తున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా తీరాన్ని చేరడం మాకు తెలుసు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా తీరాన్ని చేరడం మాకు తెలుసు. జీడీపీ వృద్ధిరేటు 7.6 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం 5.4 శాతానికి తగ్గింది. లోటు 18.4 బిలియన్ డాలర్ల నుంచి 14.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఫారిన్ కరెన్సీ రిజర్వులు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. వాతావరణ పరిస్థితులకు తోడు రాజకీయ పరిస్థితులు కూడా బాగోకపోయినా వృద్ధి సాధిస్తున్నాం. అంతర్జాతీయ మందగమనం వల్ల మనకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా మూడు రకాల సమస్యలు వస్తున్నాయి. విదేశీ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో భారతీయ మార్కెట్ల మీదే ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఆ సవాళ్లను కూడా అవకాశాలుగా మార్చుకుంటున్నాం. 14వ ఆర్థిక కమిషన్ రాష్ట్రాల వాటాను 55 శాతం నుంచి 65 శాతానికి పెంచింది. ఓఆర్ఓపీ, కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వంపై భారం పెరిగింది. దాంతో కొన్ని ఖర్చులను ప్రైవేటీకరించాలని నిర్ణయించాం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతో రైతులు నామమాత్ర ప్రీమియం చెల్లించి భారీ పరిహారం పొందుతారు. నిరుపేదల కోసం ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెడుతున్నాం' అని పేర్కొన్నారు. ఇక మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ ఈసారి అయినా తమను కరుణిస్తారని, ఆదాయం పన్ను మినహాయింపులను పెంచుతారని, శ్లాబుల్లో కూడా సవరణలు తీసుకొచ్చి రాయితీలను పెంచుతారని ఉద్యోగస్థులు ఆశిస్తున్నారు. -
రాష్ట్రపతిని కలిసిన అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఇవాళ లోక్ సభలో ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ...ఆయన మర్యాదపూర్వకంగా కలిసి జైట్లీ పార్లమెంట్ చేరుకున్నారు. అనంతరం పార్లమెంట్లో సమావేశమైన కేంద్ర కేబినెట్ ...బడ్జెట్‌పై లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి.