అవినీతి, కేసులు.. బాబు నోరు నొక్కేశాయి! | chandrababu silent on union budget 2016 | Sakshi
Sakshi News home page

అవినీతి, కేసులు.. బాబు నోరు నొక్కేశాయి!

Published Tue, Mar 1 2016 9:59 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

chandrababu silent on union budget 2016

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై నోరెత్తని ముఖ్యమంత్రి
ఓటుకు కోట్లు కేసు, అవినీతి వల్లే కేంద్రంపై ఒత్తిడి చేయని చంద్రబాబు
రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించని కేంద్రం
ప్రత్యేక హోదా ఊసు లేదు..రైల్వే జోన్ విషయంలోనూ మొండిచెయ్యి
పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లే
2018 నాటికి పూర్తి చేస్తామన్న సీఎం మాటలన్నీ అసత్యాలే!

 
సాక్షి, హైదరాబాద్: నిన్న రైల్వే బడ్జెట్‌లో మొండి చెయ్యి... నేడు సాధారణ బడ్జెట్‌లోనూ అరకొర విదిలింపులు... అయినా రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోరెత్తడం లేదు. కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌పెట్టి ‘మా అవసరాలకు తగినన్ని నిధులెందుకు ఇవ్వరు’ అని అడిగిన పాపాన పోలేదు. ఒకవైపు అవినీతి, మరోవైపు ఓటుకు కోట్లు కేసు వెంటాడుతుండడం వల్లే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేయలేకపోతున్నారని విశ్లేషకులంటున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది రాష్ర్టప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శకులంటున్నారు.

రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం, జాతీయహోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు అరకొర నిధులు విదిలించడం ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు.  ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎప్పుడూ కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. హోదా కన్నా కేంద్రం మెరుగైన ప్యాకేజీ ఇస్తుందని చెప్పిన చంద్రబాబు బడ్జెట్‌లో అరకొరగానే నిధులు విదిలించినా ఎందుకు మాట్లాడడం లేదని పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. రెండేళ్లు పూర్తవుతున్నా విభజన చట్టంలోని హామీల విషయంలోనూ కేంద్రాన్ని ఒత్తిడి చేయడానికి చంద్రబాబు సిద్ధపడడం లేదు.

స్వార్థప్రయోజనాలే కారణమా..?
అయితే రాజధానిని, పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వివాదాస్పదంగా మార్చడం వల్లే కేంద్రం మొండిచేయి చూపినట్లు అధికార వర్గాలంటున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన నిధులను పట్టిసీమ ప్రాజెక్టు కోసం వినియోగించారు. పోలవరం ప్రాజెక్టు కిందే పట్టిసీమ ప్రాజెక్టును చూపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే, చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు.

పోలవరం ప్రాజెక్టును అథారిటీ కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించారు. తన పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి, కమీషన్లు దండుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారు. అందుకే ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో  కేంద్రం రూ.200 కోట్లు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.300 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఇందుకు గతంలో ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని, వినియోగ పత్రాలు అందజేయాలని రాష్ట్రాన్ని కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు కింద చేసిన వ్యయాన్ని పోలవరం కింద చూపించి నిధులు ఇవ్వాల్సిందిగా కోరింది. దీనికి కేంద్రం ససేమిరా అంది.

పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని, అందుకు నిధు లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌లో ప్రకటించిన రూ.300 కోట్లను విడుదల చేయాలంటే వినియోగ పత్రాలు సమర్పించాలని తేల్చిచెప్పింది. ఈ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. రూ. 40 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టుకు ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున అరకొర నిధులే కేటాయిస్తున్నా 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని బాబు చెబుతున్నారు.
 
రాజధాని నిధులు పక్కదారి
రాజధాని నిర్మాణానికి కేంద్రం గతంలో ఇచ్చిన రూ.850 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు మళ్లించింది. ఇటీవల ఈ విషయం నీతి ఆయోగ్ దృష్టికి వెళ్లింది. ఇప్పటివరకు రాజధానిలో భవనాల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని నీతి ఆయోగ్ కోరింది. ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు.

దీనిపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి రూ.4,000 కోట్లు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని కోరారు. అయితే రాజధాని నిధులను ఇప్పటికే పక్కదారి మళ్లించిన నేపథ్యంలో కేంద్రం బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement