అరుణ్ జైట్లీకి లెక్కలు రావా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం వార్షిక జనరల్ బడ్జెట్ సమర్పిస్తూ మరోసారి అబద్ధం ఆడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంఎన్‌ఆర్‌ఈజీ) పథకానికి మున్నెన్నడు లేనివిధంగా 38,500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు గర్వంగా చెప్పుకున్నారు. 2006లో ప్రారంభించిన ఈ పథకానికి 2010-11 వార్షిక బడ్జెట్‌లో ఏకంగా 40,100 కోట్ల రూపాయలను కేటాయించారు. గతేడాది కూడా ఈ పథకానికి 34,699 కోట్ల రూపాయలను కేటాయించినప్పుడు కూడా మున్నెన్నడు లేని విధంగా అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఏడాది 34,000 కోట్ల రూపాయలను కేటాయించారు. దానితో పోలిస్తే గతేడాది 699 కోట్ల రూపాయలను అరుణ్ జైట్లీ అదనంగా కేటాయించగా, ఈ ఏడాది 38, 500 కోట్ల రూపాయలను కేటాయించారు.
ఒకవేళ కేటాయింపులు ముఖ్యం కాదు, ఖర్చు పెట్టిందే లెక్కనుకుంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో 38, 552 కోట్ల రూపాయలు యూపీఏ ప్రభుత్వం ఈ పథకంపై ఖర్చు పెట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కన అరుణ్ జైట్లీ మాట నిజం కావాలంటే మున్నెన్నడు లేనివిధంగా కేటాయింపులు జరిపామనకుండా, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి అత్యధిక కేటాయింపులు జరపడం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు సజీవ స్మృతి చిహ్నంగా ఈ పథకాన్ని కొనసాగిస్తామంటూ గత ఫిబ్రవరి నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం ఈ పథకంలో వారి డ్రామాను సూచిస్తోంది.
మరింత లోతుగా పరిశీలిస్తే ఎనిమిది కరవు రాష్ట్రాలతోపాటు మిగతా 21 రాష్ట్రాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈబిల్లుల మొత్తం 6,359 కోట్ల రూపాయలు. కరవు రాష్ట్రాలకు యాభై వేల పని దినాలను అదనంగా ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికీ వాటికి నిధులు విడుదల చేయలేదు. వాటిని కూడా కలుపుకుంటే ఉపాధి హామీ పథకానికి 47, 549 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. పెరిగిన ద్రవ్యోల్బణం రేటును, పెరిగిన గ్రామీణ కుటుంబాలను లెక్కలోని తీసుకుంటే ఈ పథకం అమలుకు అక్షరాల 50,000 కోట్ల రూపాయలు అవసరం. అనుభవజ్ఞుడైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఈ మాత్రం లెక్కలు రావా? ఉద్దేశపూర్వకంగా చేసిన అబద్ధపు ప్రచారమా?