ఈపీఎఫ్ పన్నుపై పునరాలోచన?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే అవకాశం కన్పిస్తోంది. దీనిపై ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనబడుతోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పేర్కొన్నారు. పదవీ విరమణ నాటికి ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిలో 40 శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. తాజా ప్రతిపాదనపై ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళన చెందుతున్నారు.
దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ పీఎస్ పన్నుల విధానంలో ప్రతిపాదిత మార్పుల పట్ల ఆందోళనను గుర్తించామని, దీనిపై సందేహాలను త్వరలోనే నివృత్తి చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. 60 శాతం మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను చెల్లించాల్సివుంటుందని పీటీఐతో రెవెన్యూ కార్యదర్శి హసముఖ్ అదియా చెప్పారు. ప్రిన్సిపల్ అమౌంట్ కు పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.