లక్నో: ఆమెకు కరోనా సోకింది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కనపెట్టి తన పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంది. ఈ తప్పిదం వల్ల ఆమె భర్తకు కూడా కరోనా సోకింది. అంతేకాక లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనల కింద ఆమెతోపాటు వేడుకలో పాల్గొన్న మరో ముగ్గురిపై పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు, బీజేపీ మహిళా మోర్చా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడిని కలవడంతో ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులనందరినీ శిఖర్‌పూర్‌లోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. (కోవిడ్ నెగిటివ్ వస్తేనే లోపలికి అనుమతిస్తాం)
అయితే ఈ మధ్యే ఆమె తన 38వ వివాహ వార్షికోత్సవ వేడుకలను క్వారంటైన్ సెంటర్‌లో వేడుకగా జరుపుకుంది. ఈ సందర్భంగా భర్త, కూతురు, అల్లుడి మధ్య కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ పార్టీ చేసుకున్నారు. దీంతో తాజా పరీక్షలో ఆమె భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో వీరి పెళ్లి వేడుకలు, కేక్ కటింగ్ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాక క్వారంటైన్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల తీరుమీదా దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలావుండగా కరోనా సోకిన భార్యాభర్తలనిద్దరినీ ఖుర్జాలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. (డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది)
Comments
Please login to add a commentAdd a comment