సాక్షి, ముంబై: ముంబైలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక అగ్నిమాపక జవాన్ మరణించగా మరో 20 మంది అగ్నిమాపక సిబ్బంది, అధికారులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అంధేరి లింక్ రోడ్డులోని 22 అంతస్తుల లోటస్ బిజినెస్ పార్క్ భవనంలో శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ అంధేరిలోని లింక్‌రోడుపై లోటస్ బిజినెస్ పార్క్ ఉంది.
ఈ కార్పొరేట్ భవనంలో అనేక ప్రముఖ కంపెనీలతోపాటు సినీపరిశ్రమకు చెందిన కార్యాలయాలున్నాయి. ఎప్పటిలానే అప్పుడప్పుడే కార్యాలయాల్లోకి వస్తున్న ప్రజలకు 21 వ అంతస్తులో సుమారు 10 గంటల ప్రాంతంలో పొగలు కన్పించాయి. ఇది గమనించేలోపే మంటలు అంతస్తు మొత్తం వ్యాపించాయి. కొన్ని క్షణాల్లోనే 20వ అంతస్తుతోపాటు పైఅంతస్తుకు కూడా ఎగబాకాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర కృషిచేశారు.
ముందు భవనంలోని వారందరిని ఖాళీచేయించారు. అయితే మంటల తీవ్రత అధికంగా ఉండడంతో బ్రిగేడ్ కాల్‌ను జారీ చేశారు. అనంతరం ఎవరైనా భవనంలో చిక్కుకుని ఉంటారని భావించి, సుమారు 32 మంది సిబ్బంది మంటలు అర్పడంతోపాటు చిక్కుకున్నవారిని రక్షించేందుకు భవనంలోని చొరబడ్డారు. మంటల తీవ్రత మరింత అధికమవడంతో ఊహించని విధంగా అనేక మంది అగ్నిమాపక సిబ్బంది మంటల మధ్య చిక్కుకున్నారు.
రంగంలోకి దిగిన నేవీ...
మంటలను ఆర్పేందుకు వెళ్లి భవనంలో ఇరుక్కుపోయిన అగ్నిమాపక సిబ్బందిని రక్షించేందుకు వెంటనే నేవీని రంగంలోకి దింపాల్సివచ్చింది. 22 అంతస్తుల భవనంపై కొందరు, లోపల కొందరు చిక్కుకుపోవడంతో బయట ఉన్న ప్రజలతోపాటు అధికారుల్లో తీవ్ర భయాందోళనలు కన్పించాయి. అయితే నేవీ సిబ్బంది హెలికాప్టర్‌ను తీసుకువచ్చారు. అనంతరం ఒకరితర్వాత మరోకరిని ెహ లికాప్టర్ సహాయంతో పైకి (ఎయిర్‌లిఫ్ట్) తెచ్చారు. మరికొందరిని భవనంలోని వెళ్లి రక్షించారు. ఇలా మంటల్లో చిక్కుకున్న అగ్నిమాపక సిబ్బందిని నేవీ అధికారులు బయటికి తీసుకరాగలిగారు.
అయితే దురదదృష్టవశాత్తు బోరివలి అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అగ్నిమాపక జవాను నితిన్ యేవలేకర్ మరణించారు. మరోవైపు 20 మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని కూపర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్ సమయంలోనే కొంతసేపు వర్షం పడటం కూడా కలిసొచ్చింది. దాంతోసాయంత్రం 6.30 గంటల వరకు భవనం టెరెస్‌పై మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. కాగా, ఈ ఘటన వల్ల అంధేరీ లింక్ రోడ్డు ప్రాంతంలో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్‌ను వేరే రూట్లలో మళ్లించారు.
ఆందోళన చెందిన హృతిక్..!
ఈ భవనంలో మూడంతస్తులు బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్‌కు సంబంధించినవి. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయనకు చెందిన మూడు అంతస్తులు ఏవేవి అనేది మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఇదే భవనంలో ప్రముఖ‘ చెఫ్’ సంజీవ్ కపూర్‌కు చెందిన రెస్టారెంట్‌తోపాటు కార్యాలయం కూడా ఉందని తెలుస్తోంది.
బిజినెస్ పార్క్ భవనంలో ఘోర అగ్నిప్రమాదం
Published Fri, Jul 18 2014 11:55 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement