న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. ఈ మాయదారి రోగానికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి మరి కొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ప్లాస్మా థెరపీ వైపు మళ్లీంది. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా కేజ్రీవాల్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు, కరోనా వైరస్ చికిత్స కోసం ప్లాస్మా పొందడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్లాస్మాను దానం చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను’ అన్నారు. ఐఎల్‌బీఎస్ ఆస్పత్రిలో ఈ ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు ఆప్ ట్వీట్ చేసింది. ప్లాస్మా దాతకు ఉండాల్సిన లక్షణాలు గురించి కూడా కేజ్రీవాల్ వెల్లడించారు. (కోలుకున్నవారు..కోవిడ్‌పై వార్)
ఎవరు దానం చేయవచ్చు
ఒక వ్యక్తి కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకొని, 14 రోజుల పాటు ఏ లక్షణాలు లేకుండా ఉంటే ప్లాస్మాను దానం చేయవచ్చని కేజ్రీవాల్ తెలిపారు. 18-60 ఏళ్లలోపు ఉండి.. 50కిలోల కంటే ఎక్కువ బరువున్న వారు ప్లాస్మాను దానం చేయవచ్చన్నారు.
ప్లాస్మా దానానికి అనర్హులు ఎవరంటే
డయాబెటిస్, ఇన్సులిన్ ఉన్నవారు, క్యాన్సర్‌తో పోరాడుతున్న వారు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భవతులు ప్లాస్మా దానం చేయడానికి అనర్హులు అన్నారు. అంతేకాక ఒక వ్యక్తి రక్తపోటు 140 కన్నా ఎక్కువ, డయాస్టొలిక్ 60 కన్నా తక్కువ లేదా 90 కన్నా ఎక్కువ ఉంటే అతను లేదా ఆమె ప్లాస్మాను దానం చేయకూడదని కేజ్రీవాల్ తెలిపారు. ప్లాస్మా దానం చేయడానికి ఇష్టపడే వారు 1031కు కాల్ చేయడం లేదా 8800007722 నంబరుకు వాట్సాప్ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. రక్త దానం చేయడం వల్ల బలహీనం కావచ్చు కానీ ప్లాస్మా దానం వల్ల అలా జరగదని తెలిపారు.
Delhi Govt to facilitate donors.
— AAP (@AamAadmiParty) July 2, 2020
1. Govt will arrange for transport to the ILBS Hospital, or reimburse travel cost.
2. If you've not yet been tested negative after being tested positive for Covid initially, we will arrange for you to be tested.
Link: https://t.co/jsU7p3y4H7
ప్రభుత్వ సదుపాయాలు
1. ప్లాస్మా దానం చేయాలనుకునే వారు ఐఎల్‌బీఎస్ ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. వారి ప్రయాణానికి అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
2. ప్లాస్మా దానం చేయాలనుకుంటున్న వ్యక్తికి మొదట కరోనా పాజిటివ్ వచ్చి.. ప్రస్తుతం ఇంకా నెగిటివ్ రాని వారికి ప్రభుత్వమే మరోసారి పరీక్షలు చేస్తుంది.
3. ప్లాస్మా దానం చేయడానికి వచిన వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
4. ప్లాస్మా దానం చేసిన వారికి ముఖ్యమంత్రి సంతకం చేసిన ‘ప్లాస్మా డోనర్ సర్టిఫికెట్’ ఇస్తామని తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో అత్యంత బలమైన యాంటీ బాడీస్ ఉంటాయి. అవి ఇతరులకు సోకిన కరోనాను కట్టడి చేయడంలో తోడ్పడతాయి. అయితే... ప్లాస్మాను ఎవరి నుంచి, ఎలా సేకరించాలి అనే అంశంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్) గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది. ప్లాస్మా సేకరణకు ముందు... దాతకు యాంటీ బాడీ స్క్రీనింగ్ చేస్తారు. తద్వారా ఆ వ్యక్తిలో యాంటీ బాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుంటారు. ఎందుకంటే... కరోనా నుంచి కోలుకున్నవారిలో... వెంటనే యాంటీబాడీస్ తయారవ్వవు. అందుకు కొంత టైమ్ పడుతుంది. సరిపడా యాంటీబాడీస్ ఉన్నాయని నిర్థారింయిచిన తర్వాతే... దాత నుంచి ప్లాస్మా సేకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment