
గోఎయిర్ విమానం అత్యవసర కిటికీ తలుపు తీసిన దృశ్యం
బొమ్మనహళ్లి (కర్ణాటక): విమానంలో గాలి రావడం లేదని ఓ ప్రయాణికుడు అత్యవసర కిటికీ తలుపు తీశాడు. దీన్ని సకాలంలో సిబ్బంది గుర్తించి విమానం టేకాఫ్‌కు ముందే కిటికీ మూసివేయించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం జరిగింది. లక్నోకు వెళ్లేందుకు గాను సునీల్‌కుమార్ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం 8 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చాడు. గోఎయిర్ విమానంలో ఎక్కి..తనకు కేటాయించిన విండో పక్కన సీటులో కూర్చున్నాడు. ఉక్కపోతగా ఉండటంతో అత్యవసర కిటికీ ద్వారానికి ఏర్పాటు చేసిన గ్లాస్ డోర్‌ను పక్కకు జరిపాడు. దీన్ని విమాన సిబ్బంది గుర్తించి అతడిని హెచ్చరించి వెంటనే డోర్ మూసి వేయించారు. సునీల్‌ను విమానంలో నుంచి కిందికి దించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ..తాను మొదటిసారిగా విమానం ఎక్కానని, గాలి తగలకపోవడంతోనే విండో డోర్ తెరిచానని..ఇందులో మరో ఉద్దేశమేమీ లేదని విమానాశ్రయ అధికారులకు చెప్పాడు. అనంతరం అతడిని మరో విమానంలో లక్నోకు పంపించారు. ఈ ఘటనపై గో ఎయిర్ సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చెయ్యలేదు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment