సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల మనోగం ఈవీఎంల్లో నిక్షిప్తమయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల తలరాతలు నిర్ణయించే అంశాలు మాత్రం ఐదున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. తన సర్వశక్తులూ ఒడ్డీ మరీ గెలుపుకోసం ప్రయత్నించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం.. విజయం కోసం విశ్వప్రయత్నాలు చేశారు. జిగ్నేష్ మేవాని, అల్ఫేష్ ఠాకూర్, హార్ధిక్ పటేల్‌లను కలుపుకుని.. మరీ ఎన్నికలకు దూసుకెళ్లారు. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు చెబితే.. కాంగ్రెస్‌కు విజయావకాశాలు కొట్టిపారేయలేమని బీజేపీ నేతలే ప్రకటిస్తున్నారు.
మోదీ మాస్ చరిష్మా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుజరాత్ సొంత రాష్ట్రం. మోదీ ప్రధాని ఆయ్యాక గుజరాత్ అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికలు ఇవే. కులాల ఈక్వేషన్లు, ఇతర కారణాలతో మోదీ పాపులారిటీ తగ్గిందని అదరూ అంచనా వేశారు. అయితే.. ఇందుకు పూర్తీ వ్యతిరేకంగా ప్రజలు మోదీపై అభిమానం చూపారు. ఇదే సమయంలో గుజరాతీలు ఈ ఎన్నికలను ఎన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ఇది మోదీకి అనుకూలంగా మారుతుందని కొందరు విశ్లేషకలు అంచనా వేస్తున్నారు.
పటేదార్ ఉద్యమం
పటేల్ వర్గానికి రిజర్వేషన్ల కోరుతూ మొదలైన చిన్న ఉద్యమం తరువాత దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది. ఈ ఉద్యమాన్ని నిరోధించలేకపోవడంతోనే.. ఆనందీబెన్ పటేల్ పదవిని వదులుకోవాల్సి వచ్చిందనే వాదనలు ఉన్నాయి. మొత్తం గుజరాత్ జనాభాలో 12 శాతం ఉండే పటేల్ వర్గం.. రిజర్వేషన్ల కోసం రెండేళ్లుగా తీవ్ర ఉద్యమం చేస్తున్నారు. మొదట నుంచీ బీజేపీకి అనుకూలంగా ఉన్న పటేల్ వర్గం ఉంది. అయితే రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారవచ్చనే అంచనాలున్నాయి.
జీఎస్టీ, డిమానిటైజేషన్
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, పెద్ద నొట్లు రద్దు వంటి మోదీ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రెండు నిర్ణయాల వల్ల గుజరాత్‌లోని వ్యాపారవేత్తలు ఇబ్బందులు పడ్డట్లు తెలిసిందే. ఇక బీజేపీ కూడా జీఎస్టీపై తమ వ్యూహాలను మార్చుకుంది. అందులో భాగంగానే వారిని తృప్తి పరిచేందుకు జీఎస్టీలో కొన్ని సవరణలు చేసింది.
ప్రభుత్వ వ్యతిరేకత
దాదా 22 ఏళ్లుగా గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంది. సహజంగానే ఏ ప్రభుత్వమైనా రెండుసార్లు అధికారంలోకి వస్తే.. మూడో ఎన్నికల నాటికి తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవడం సహజం. ఈ నేపథ్యంలో వరుసగా 5 దఫాలు ప్రభుత్వంలో ఉన్న బీజేపీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత వ్యక్తమవడం సహజం. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా గుజరాత్ మోడల్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఒక దశలో ప్రజలను సైతం తమ వాదనతో ఒప్పించింది. ఇది ఎంత వరకూ కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తుందనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.
వివాద వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన ‘నీచ్ ఆద్మీ’ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఒక దశలో రాహుల్ గాంధీ కలగజేసుకుని ఆయనతో క్షమాపణ చెప్పించి.. తరువాత మణిశంకర్ అయ్యర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే బీజేపీ దేశభక్తి అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. ప్రధానంగా నన్ను చంపేందుకు సుపారీ ఇచ్చారంటే మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వివాదం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం చేకూర్చిందో మరికొద్ది గంటల్లోనే తేలుతుంది.
Comments
Please login to add a commentAdd a comment