![Food Delivery Boy Emotional After Customer Order Birthday Cake For Him - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/1/food-deliver2.jpg.webp?itok=YzNbWxeQ)
వూహాన్: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అడుగు బయటకు పెట్టాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. కానీ ఇలాంటి సమయంలోనూ మనకోసం నిత్యావసర సరుకులు, ఆహారాన్ని అందించడానికి డెలివరీ బాయ్స్ నిరంతరం శ్రమిస్తున్నారు. వీరి కష్టాన్ని గుర్తించిన జనాలు వారిపై తమకు తోచినవిధంగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. అయితే తొలిసారిగా కరోనా బయటపడ్డ వూహాన్ నగరంలో ఓ డెలివరీ బాయ్‌కు మర్చిపోలేని అనుభవం ఎదురైంది. ఎప్పటిలాగే ఏప్రిల్ 15న కూడా తనకు వచ్చిన ఆర్డర్లను చూసుకుని వాటిని డెలివరీ చేస్తున్నాడు. అందులో భాగంగా రాత్రి వచ్చిన కేక్ ఆర్డర్ తీసుకునేందుకు బేకరీకి వెళ్లగా షాపులో పనిచేసే వ్యక్తి అది తనకోసమేనని చెప్పాడు. (ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్ కాస్త సెలబ్రిటీ)
దీంతో అయోమయానికి లోనైన ఆ యువకుడు "పొరపాటుపడుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి" అని మరీమరీ చెప్పగా అతను మళ్లీ డెలివరీ బాయ్ పేరే చెప్పాడు. దీంతో ఆశ్చర్యానికి లోనైన డెలివరీ బాయ్‌కు అప్పుడు గుర్తుకు వచ్చింది ఆరోజు తన పుట్టిన రోజని. ఉప్పొంగుకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కేక్ తీసుకుని బేకరీ బయటకు వెళ్లి కూర్చున్నాడు. కళ్ల నుంచి వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ ఆ కేక్‌ను ఆదుర్దాగా తిన్నాడు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "ఆ అజ్ఞాత కస్టమర్ ఎవరో కానీ డెలివరీ బాయ్‌కు జీవితాంతం గుర్తుండిపోయే కానుకిచ్చార"ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (డెలివరీ బాయ్ వెంటపడుతున్న నెటిజన్లు)
Comments
Please login to add a commentAdd a comment