కాంగ్రెస్ కూడా ‘రాష్ట్రపతి’గా దళిత వ్యక్తినేనా?
న్యూఢిల్లీ: దెబ్బకు దెబ్బ అన్నట్లు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి ఝలకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరుపున దళిత వర్గానికి చెందిన బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దళిత వ్యక్తినే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో కేంద్ర హోమంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే, లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మీరాకుమార్‌లలో ఎవరినో ఒకరిని అధ్యక్ష అభ్యర్థిగా కాంగ్రెస్ తెరమీదకు తీసుకురావాలనుకుంటుందట.
దీనిపై జూన్ 22న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షిండేను ముందుకు తెస్తే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయినందున తమకు శివసేన మద్దతు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, స్పీకర్ మీరాకుమార్‌ను తెరమీదకు తెస్తే బిహార్‌లోని జేడీయూ మద్దతు లభిస్తుందని భావిస్తోందట. ఇదిలా ఉండగా, ఈ విషయంపై తనకు అసలు సమాచారమే లేదంటూ షిండే కొట్టి పారేశారు. అసలు ఇలాంటిది అసాధ్యం అని, ఆ ప్రశ్నే లేదని అన్నారు.