ఆధార్ కన్నా ఇదే డేంజర్...
ఆధార్ కన్నా ఇదే డేంజర్...
Published Fri, Sep 1 2017 3:36 PM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM
న్యూఢిల్లీః ఆధార్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంటే అంతకుమించిన ప్రమాదం మన అరచేతిలోనే ఉందని నిపుణులు సరికొత్త బాంబు పేల్చారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా భారతీయులకు డేటా చోరీ, గోప్యతకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.భారత హోంమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహరిషి ఇటీవల పార్లమెంటరీ కమిటీతో ఈ విషయంపై హెచ్చరించిన వైనం వెలుగుచూసింది. దేశంలో స్మార్ట్ ఫోన్‌లు, ప్రముఖ యాప్స్ వాడుతున్న వారిలో 40 శాతం మంది తెలిసో..తెలియకో అమెరికాలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) సహా ప్రపంచానికంతటికీ తమ డేటాను షేర్ చేస్తున్నారని మెహరిషి చెప్పారు.
హోంవ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ ఎదుట జులై 21న హాజరైన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఫింగర్‌ప్రింట్స్, బయోమెట్రిక్స్ క్యాప్చర్ చేస్తున్నారని మెహరిషి పేర్కొన్నారు. ఇక 70 శాతం పైగా స్మార్ట్ ఫోన్ యాప్స్ వ్యక్తిగత డేటాను గూగుల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలకు షేర్ చేస్తున్నట్టు ఐఎండీఈఏ నెట్‌వర్క్ వెల్లడించిన తాజా అథ్యయనంలో తేలింది. మరోవైపు డేటా లీకేజీ, చోరీ వార్తల నేపథ్యంలో భారత్‌లో విక్రయించే స్మార్ట్ ఫోన్ల సెక్యూరిటీకి ఎలాంటి పద్ధతులు, విధానాలు అవలంభిస్తున్నారో వెల్లడించాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ 30 స్మార్ట్‌ఫోన్ కంపెనీలను కోరింది.
యాపిల్, శాంసంగ్, చైనా కంపెనీలు ఒప్పో, వివో, షియోమి, లెనోవా, జియోని వంటి కంపెనీలను ఈ వివరాలు వెల్లడించాల్సిందిగా అధికారులు కోరారు. మొబైల్ ఫోన్లకు సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలను ప్రభుత్వం త్వరలో నిర్ధేశించనుంది.
Advertisement
Advertisement