రూపాయి భారీగా పతనమైంది అప్పుడే!
భారత్ ఆర్ధిక వ్యవస్థ తిరోగమనంలోకి నడవడం ప్రారంభించి యాభై ఏళ్లు పూర్తైంది. సరిగ్గా 06/06/1966 న మన కరెన్సీ రూపాయి విలువను అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక్కసారిగా 36.5 శాతం తగ్గించేశారు. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 57.4 శాతానికి పడిపోయింది. లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణానంతరం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఇందిరా 1966లో దేశంలో వచ్చిన తీవ్రమైన కరువును తట్టుకునేందుకు రూపాయి విలువను భారీగా తగ్గించి, ఇతర దేశాల నుంచి బియ్యం, నిత్యవసర వస్తువుల దిగుమతులకు అనుమతినిచ్చారు.
1965లో రూ.2,194 కోట్ల విలువైన వస్తువులను దిగుమతుల ద్వారా తెచ్చుకున్న ఇండియా కేవలం రూ.1,264 కోట్ల ఎగుమతులను మాత్రమే చేసింది. దీంతో 60వ దశకంలో అత్యధికంగా రూ.930 కోట్ల లోటును భారత్ చవిచూసింది. 1966లో వచ్చిన తీవ్ర కరువు కారణంగా భారత్ అమెరికా సాయాన్ని కోరింది. 'ఫుడ్ ఫర్ పీస్' పేరుతో అమెరికా సాయం చేస్తూ భారత్ కరెన్సీలోనే డబ్బును చెల్లించేందుకు అంగీకరించింది.
దీంతో అమెరికా భారత్ కు సముద్ర రవాణా ద్వారా దాదాపు 16 మిలియన్ టన్నుల గోధుమ, ఒక మిలియన్ టన్ను బియ్యం, ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని అందజేసింది. సరళీకరణ చేసుకోవాలని భారత్ కు సూచించింది. దీనిపై నిర్ణయం తీసుకున్న ఇందిరా గాంధీ అప్పటివరకు డాలర్ తో రూ.4.76గా ఉన్న మారకం విలువను రూ.7.50లకు పెంచారు. డాలర్ తో రూపాయి మారకం విలువను తగ్గించడంతో ఇందిరాపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ప్రపంచబ్యాంకు, అమెరికాకు దేశాన్ని అమ్మేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. 1970లో ఇందిరా ఆర్థిక లోటును రూ.100 కోట్లకు తీసుకువచ్చారు. ఆనాడు ఇందిరా తీసుకున్న నిర్ణయం కారణంగానే నేడు మన ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటూ అభివృద్ధికి చేరువ అవుతోంది. 1947లో ఆగష్టు 15న డాలర్ తో సమానంగా ప్రారంభమయిన రూపాయి విలువ నేటికి 06/06/2016కి 600 శాతం పడిపోయింది. ఇక్కడ నుంచి మనం ఎక్కడకు వెళ్లనున్నామో!