అహ్మదాబాద్ ఏసీపీకి రేవతి ఫిర్యాదు
అహ్మదాబాద్: ప్రముఖ జర్నలిస్టు, సామాజిక వేత్త, రచయిత్రి రేవతిలాల్ పై కరుడుకట్టిన నేరస్తుడు దాడి చేయడం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన నరోడా-పాటియా హింసాకాండ ఉదంతంపై పుస్తకం రాస్తున్న ఆమె ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న సురేష్ ఛరాను ఇంటర్య్వూ చేయడానికి వెళ్లినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నరోదా-పాటియా ఉదంతంలో శిక్ష అనుభవిస్తున్నసురేష్ ఛరా అదృశ్యమైన తన కుమార్తె ఆచూకీ కోసం గత వారం పెరోల్ పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పుస్తకం రాస్తున్న రేవతి ఈ కేసులో కీలకమైన సురేష్ ను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించారు. అతడిని కలిసి వివరాలు అడుగుతున్న క్రమంలోనే అకస్మాత్తుగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. అమానుషంగా ప్రవర్తించాడు. పిడిగుద్దులు కురిపించి, ముఖంపై ఉమ్మివేసి నీచంగా ప్రవర్తించాడు. తాను చాలా మర్యాదగా సమాచారాన్ని సేకరిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా సురేష్ దాడి చేశాడని రేవతి తెలిపారు. ముఖంపై కొట్టాడని, గోడకేసి తలను బాది దారుణంగా ప్రవర్తించాడన్నారు. చివరికి అతని బంధువుల సహాయంతో అక్కడ నుంచి బయటపడ్డానని చెప్పారు.
కాగా 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్ శివార్లలోని నరోడ-పాటియాలో అల్లరి మూకలు మహిళలపై సామూహిక అత్యాచారాలకు తెగబడి నరమేధం సృష్టించాయి. మతోన్మాద హింస చెలరేగింది. ఈ కేసులో దోషిగా తేలిన సురేష్ ఛారకు కోర్టు 31 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ హింసాకాండలో 97 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. కాగా, పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు తన పట్ల అమానుషంగా ప్రవర్తించాడని.. భర్త నుంచి ప్రాణహాని ఉందని గత డిసెంబర్ లో పోలీసులకు సురేష్ భార్య ఫిర్యాదు చేసింది.