
సెల్వానికి కేంద్ర మాజీ మంత్రి జై
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూటమికి కేంద్ర మాజీ మంత్రి ఈ పొన్నుసామి జై కొట్టాడు. ఆయన శుక్రవారం సాయంత్రం పన్నీర్‌తో చేరిపోయారు.
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూటమికి కేంద్ర మాజీ మంత్రి ఈ పొన్నుసామి జై కొట్టాడు. ఆయన శుక్రవారం సాయంత్రం పన్నీర్‌తో చేరిపోయారు. అయితే, ఆయన చేరికపై అన్నాడీఎంకే అధికారిక ప్రతినిధి వైగైచెల్వన్ స్పందిస్తూ తమ రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్నవారే సెల్వంతో చేరుతున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తనతో బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఆరోపిస్తూ గత మంగళవారం రాత్రికి రాత్రే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళపై తిరుగుబాటుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఎం సీటు నీకు నాకా అంటూ తగువులాడుతున్నారు. బలం తనకుందంటే తనకుందంటే క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నారు. ఈ క్రమంలో కొందరు శశికళవైపు వెళుతుండగా మరికొందరు సెల్వం శిబిరానికి చేరుకుంటున్నారు. మాజీ నాయకులంతా దాదాపు పన్నీర్ సెల్వానికే తమ మద్దతంటూ బహిరంగంగా చెబుతున్న విషయం తెలిసిందే.